డీసీసీ పీఠంపై కవిత
⇒ ఇద్దరు సభ్యులకు ఎన్నిక నిర్వహించిన కలెక్టర్
⇒ఓటింగ్‌లో పాల్గొన్న 21 మంది జడ్పీటీసీలు
⇒టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
⇒టీఆర్ఎస్-9, కాంగ్రెస్ 6, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, సీపీఐ, ఎన్డీలకు ఒక్కో స్థానం
⇒ఒక్కస్థానాన్నీ దక్కించుకోలేకపోయిన సీపీఎం
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నిక ముగిసింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత దీనికీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నిక జరిగింది. మొత్తం 19 మందికి 17 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దుమ్ముగూడెం జడ్పీటీసీ నామినేషన్ ఉపసంహరణ పారమ్‌ను ప్యాక్స్‌లో పంపడంతో దాన్ని కలెక్టర్ అంగీకరించలేదు. రెండు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నిక అనివార్యమైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ అధికారులు ఎన్నిక నిర్వహించారు.
21 మంది జడ్పీటీసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనరల్ కేటగిరీ నుంచి పోటీపడిన ఉన్నం వీరేందర్, మందారపు నాగేశ్వరరావులకు చెరి 21 ఓట్లు వచ్చాయి. సీపీఎం అభ్యర్థి అన్నెం సత్యనారాయణ ఓటువేసేందుకు రాకపోవడంతో ఆయనకు ఒక్క ఓటు కూడా పడలేదు. చెరి 21 ఓట్లతో సమానంగా నిలిచిన ఇద్దరు సభ్యులు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఇలంబరితి ప్రకటించారు. డీపీసీకి ఎన్నికైన సభ్యులు టీఆర్ఎస్ -9, కాంగ్రెస్ -6, ఎన్డీ -1, వైఎస్సాఆర్సీపీ -1, సీపీఐ-1, టీడీపీ -1 చొప్పున దక్కించుకున్నాయి. ఈ ఎన్నిక పూర్తవడంతో వారం రోజులుగా ఆయా పార్టీల ఎత్తులు, పై ఎత్తులకు తెరపడింది.