డీపీసీ ‘మంత్రాంగం’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ముగిసింది. మొత్తం 24 సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 10 గ్రామీణ మంది సభ్యులను జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు ఎన్నుకోనుండగా, 14 మంది పట్టణ సభ్యులను మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో పోటీ చేసే అభర్థుల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం గడువు విధించ గా.. సమయం ముగిసేనాటికి గ్రామీణ కేటగిరీలో 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, పట్టణ కేటగిరీలో 25 మంది సభ్యులు నామినేషన్లు వేశారు.
ఏకగ్రీవం కోసం..
డీపీసీ సభ్యుల ఎన్నికలో ప్రస్తుతం పోటీ తీవ్రంగానే ఉంది. గ్రామీణ కేటగిరీలో బీసీ మహిళ కోటాలో ఒక సీటుకు ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతుండగా.. మిగతా స్థానాలన్నీ ఏకగ్రీవం కానున్నాయి. అదేవిధంగా పట్టణ కేటగిరీలో బీసీ మహిళ కోటా మినహా మిగతా అన్నింటా పోటీ ఉంది. ఎన్నికల్లో నామినేషన్లు సమర్పించిన అభ్యర్థుల జాబితాను శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియలో పోటీ లేకుండా ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు పార్టీలు రంగంలోకి దిగాయి. పోటీ పడుతున్న అభ్యర్థులను బుజ్జగించి నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు కీలక నేతలు రంగంలోకి దిగారు.
అలా ముందుకెళ్దాం..
జిల్లా పరిషత్లో సింగిల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేదు. ప్రస్తుతం టీడీపీ సభ్యుల మద్దతుతోనే జెడ్పీలో పాలకవర్గం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో గ్రామీణ సభ్యుల ఎన్నికలు సైతం లాంఛనమే కానున్నాయి. పది స్థానాలకు గాను ఒకచోట మాత్రమే ఇద్దరు పోటీ పడుతుండగా.. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు బుజ్జగింపులకు దిగారు. మరోవైపు మున్సిపాలిటీ పరిధిలోని ఒక స్థానం మినహా మిగతా అన్నిచోట్ల పోటీ ఉంది.
రంగంలోకి దిగిన రాజకీయ పార్టీలు పట్టణ కోటా సీట్లలోనూ ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు పార్టీల నేతలు అంతర్గతంగా సీట్ల సంఖ్యను ఖరారు చేసుకుంటున్నారు. మొత్తంగా ఈనెల 16తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. దీంతో ఆలోపు మంత్రాంగం పూర్తిచేసేందుకు నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు.