చదువుకొనలేం!
చదువు అంగట్లో సరుకైంది. ఒక్కో స్కూలులో ఒక్కో క్లాసుకు ఒక్కో ధర నిర్ణయించి జోరుగా వ్యాపారం చేస్తున్నారు. ఊరూరా వెలిసిన ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు పోటాపోటీగా విద్యావ్యాపారం చేస్తున్నా విద్యాశాఖాధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. వేల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నా నియంత్రించాలనే కనీస ప్రయత్నం కూడా సదరు అధికారులు చేయడం లేదు. వెరసి విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజుల భారం మోయక తప్పడం లేదు.
‘మా పిల్లాడిని ఎల్కేజీలో చేర్పించేందుకు ఓ కార్పొరేట్ స్కూలుకు వెళ్లా. ట్యూషన్ ఫీజు రూ.15వేలు అడుగుతున్నారు. ఫీజుతో చదువు పూర్తయ్యే పరిస్థితి లేదు. యూనిఫాం..బుక్స్, బూట్లు...బస్సుకు కలిపితే తిరిగి అంతవుతోంది. అసలు ఫీజుతో పాటు కొసరు ఖర్చు కలిపి తడిసిమోపెడవుతోంది. పిల్లోడు బాగా చదువుతాడని ఇక్కడ చదివించాలనుకుంటే ఇక్కడి ఖర్చు చూస్తేనే భయమేస్తోంది. చదువుకునే రోజులుపోయి చదువుకొనే రోజులొచ్చాయంటే ఇదేనేమో!’ ఇదీ ఓ సగటు మనిషి ఆవేదన
సాక్షి ప్రతినిధి,కడప: జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దందాకు అడ్డులేకుండా పోయింది. నిబంధనలు తుంగలో తొక్కు తూ.. ఫీజుల నియంత్రణ జీవోలు కాగితాలకే పరిమితం చేస్తూ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు పిల్లల తల్లిదండ్రులను నిలువునా దోచేస్తున్నాయి. కాన్సెప్ట్, ఐఐటీ, ఈ టెక్నో, ఆ టెక్నో అంటూ ఫీ‘జులుం’ ప్రదర్శిస్తున్నాయి. ఈ దందాను అడ్డుకోవాల్సిన విద్యాశాఖ చోద్యం చూస్తోంది.
ఎంత దారుణం...
కడపలోని ఓకార్పొరేట్ పాఠశాలలో ఎల్కేజీ విద్యార్థికి ట్యూషన్ ఫీజు రూ. 15వేలు తీసుకుంటున్నారు. పదో తరగతి విద్యార్థికి రూ. 35 వేలు తీసుకుంటున్నారు.
అలాగే నగరంలో సెంట్రల్ సిలబస్‌ను బోధించే రెండు బడా పాఠశాలలో దిమ్మతిరిగే ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇందులో ఓ స్కూలులో 1-4 వరకూ 46వేలు, 5-10 వరకూ రూ. 76వేలు ఫీజు వసూలు చేస్తున్నారు. బస్సు కావాలంటే అదనంగా చెల్లించాల్సిందే!
వడ్డింపు.. అదనం
ఫీజులతో కాకుండా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఆటో లేదా పాఠశాల బస్సు తదితర అవసరాలకు అదనంగా మరింత ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని కలుపుకుంటే ఫీజులు తడిసిమోపెడవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ప్రైవేటు పాఠశాలలకు టెక్నో, ఈ టెక్నో తదితర తోకలను విద్యాశాఖ అధికారులు కత్తిరించినా.. ఇంకా కొన్ని ఉన్నాయి. పైగా పత్రికలు, టీవీ, కరపత్రాల ప్రకటనల్లో పాత పేర్లతోనే పబ్లిసిటీ సాగిస్తున్నారు.