‘గిరిజన సంక్షేమాని’కి బదిలీ గండం!
ఇందూరు : జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జ్ అధికారిగా ఇతర జిల్లా అధికారులు ఎవరు వచ్చినా వారం రోజులు తిరగకముందే బదిలీపై వెళ్లిపోతున్నారు. దీంతో డీటీడబ్ల్యూ పోస్టులో రెండు రోజులకు ఒక అధికారి ఇన్చార్జిగా ఉంటున్నారు. రెండు నెలల క్రితం గిరిజన సంక్షేమ శాఖ రెగ్యులర్ అధికారిగా రాములు కొనసాగారు. ఆయన పదవీ విరమణచేయగానే అసిస్టెంట్ సాంఘిక సంక్షేమ శాఖ నిజామాబాద్ అధికారి(ఏఎస్‌డబ్ల్యూ) జగదీశ్వర్‌రెడ్డికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వారం రోజులకే ఆయనను బాధ్యతల నుంచి తప్పించారు. వెంటనే జిల్లా యువజన సంక్షేమ శాఖ సీఈఓ మాధవరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన వారం రోజుల పాటు పని చేశారో లేదో ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లారు. మళ్లీ స్థానం ఖాళీ కావడంతో రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) పీఓ కిషన్‌రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన కూడా నాలుగు రోజుల పాటు పని చేశారో లేదో వేరే జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం జిల్లా బీసీ సంక్షేమ శాఖకు ఇన్చార్జ్ అధికారిగా పని చేస్తున్న విమలాదేవికి గిరిజన సంక్షేమ శాఖకు ఇన్చార్జ్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు.
సిబ్బంది ఇష్టారాజ్యం
ఇలా నెల 15 రోజుల్లోనే జిల్లా గిరిజన సంక్షేమ శాఖకు నలుగురు అధికారులు ఇన్‌చార్జ్‌లుగా పనిచేసి బదిలీ లేదా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. శాఖకు రెగ్యులర్ అధికారి లేకపోవడంతో శాఖ పరిస్థితి దయనీయంగా మారింది. సిబ్బంది కూడా క్రమ శిక్షణ తప్పి ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బాధ్యతలు స్వీకరించిన విమలాదేవి
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జ్ అధికారిగా సీహెచ్. విమలా దేవి నియామకమయ్యారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వర్రావు వఆమెకు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఈమె జిల్లా బీసీ సంక్షేమ శాఖకు ఇన్చార్జ్ అధికారిగా కొనసాగుతున్నారు. దీంతో సొంత ఉద్యోగమైన బోధన్ ఏబీసీడబ్ల్యూఓ స్థానంలో పని చేస్తూ ప్రస్తుతం బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్‌గా, బీసీ సంక్షేమ శాఖ అధికారిగా, గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా మూడు శాఖలకు ఇన్చార్జ్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.