కళ్లు బైర్లు కమ్మేటన్ని పళ్లు
ముంబై: కుడివైపు దవడ వాపుతో పది రోజుల క్రితం డెంటల్ డాక్టర్ దగ్గరవెళ్లాడు ఇక్కడి బుల్దానా ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల ఆషిక్ గవాయ్. పరీక్షలు చేసిన తర్వాత దంతంలోని అసాధారణ పెరుగుదల వల్ల దవడ ఎముకపై ప్రభావం పడి వాపు వచ్చిందని డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. దానికి ఆపరేషన్ చేయడమే పరిష్కారమని నిర్ణయించుకుని సోమవారం ఆ పని ప్రారంభించారు. అంతే.. ఆషిక్ నోటి నుంచి ఒక్కో పన్ను బయటపడుతుంటే డాక్టర్లు నోళ్లు వెళ్లబెట్టారు.
అలా ఆ అసాధారణ దంతం పక్కల నుంచి 232 చిన్న చిన్న పళ్లు తీశారు. తమ ఆస్పత్రి చరిత్రలోనే ఇప్పటివరకూ ఇలాం టి పన్ను చూడలేదంటూ ఆశ్చర్యపోయారు. అవన్నీ వేటికవే విడివిడిగా ఉంటూ ఒక దంతంలా అభివృద్ధి చెందాయని శస్త్రచికిత్స చేసిన జేజే ఆస్పత్రి డెంటల్ డిపార్ట్మెంట్ హెడ్ దివారే పల్వాంకర్ పేర్కొన్నారు. ఆ దంతం సైజు 3.5ఁ2 సెంటీమీటర్లతో రాయిలా ఉందని మంగళవారం చెప్పారు. ఆ పన్ను లోపల రాయి లాంటి గట్టి పదార్థం ఒకటుందని, దానిని డెంటిస్టుల డ్రిల్తో తీసే పరిస్థితి లేదన్నారు. పక్క దంతాలు, దవడ దెబ్బతినకుండా సుత్తి-సేనంతోనే దానిని జాగ్రత్తగా పగలకొట్టి తీయాలని చెప్పారు. పాల పళ్ల తర్వాత దశ నుంచి ఈ అసాధారణ పెరుగుదల ప్రారంభమై ఉంటుందని దివారే వివరించారు. దీనిని వైద్య పరిభాషలో ‘కాంప్లెక్స్ కాంపోజిట్ ఒడాన్టమ్’ అంటారని చెప్పారు.