అటూ.. ఇటూ..!
ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ముక్కలు
హుస్నాబాద్ మూడు జిల్లాల్లోకి.. మిగిలినవి రెండు జిల్లాలోకి..
మూడు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే
మిగిలిన ఎమ్మెల్యేలు రెండేసి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం
నాలుగు జిల్లాలకు కరీంనగర్ ఎంపీ, మూడు జిల్లాలకు పెద్దపల్లి
6 నుంచి 11 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనున్న ఎమ్మెల్సీలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాల పునర్విభజనతో ఎంపీలు, ఎమ్మెల్యేలకు కొత్త చిక్కు వచ్చింది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా ప్రకారం వీటిలో ఏడు సెగ్మంట్ల పరిధిలో గల కొన్ని మండలాలు ఇతర జిల్లాలోకి వెళ్తున్నాయి. దీంతో ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇకనుంచి రెండు మూడు జిల్లాల్లో ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగేంత వరకు ప్రజాప్రతినిధులకు ఈ పరిస్థితి తప్పదు.
పునర్విభజనలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం మూడు ముక్కలవుతుండగా, సిరిసిల్ల, చొప్పదండి, వేములవాడ, ధర్మపురి, మంథని, మానకొండూరు, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు రెండేసి జిల్లాల్లోకి వెళుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడ మండలాలు సిద్దిపేటలోకి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హన్మకొండలోకి వెళ్తుండగా.. సైదాపూర్, చిగురుమామిడి మండలాలు మాత్రమే కరీంనగర్లో మిగులుతాయి. దీంతో హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్ మూడు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వీణవంక మినహా మిగిలిన మూడు మండలాలు హన్మకొండ జిల్లాలోకి వెళుతున్నాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఈటల రాజేందర్ రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలం సిద్దిపేటకు, సిరిసిల్ల, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాలను కరీంనగర్ జిల్లాకు కేటాయించారు. ముసాయిదా యథాతథంగా ఆమోదం పొందితే సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ సైతం కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సిందే. వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాలు జగిత్యాల జిల్లాకు, వేములవాడ, కోనరావుపేట, చందుర్తి మండలాలు కరీంనగర్ జిల్లాకుSకేటాయించారు. ధర్మపురి నియోజకవర్గాన్ని తొలుత జగిత్యాల జిల్లాకే కేటాయించినప్పటికీ చివరి నిమిషంలో ధర్మారం మండలాన్ని పెద్దపల్లి జిల్లాకు మార్చారు. చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల, మల్యాల మండలాలు జగిత్యాల జిల్లాలోకి వెళ్తుండగా, చొప్పదండి, గంగాధర, బోయినపల్లి, రామడుగు మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉంటాయి. మంథని నియోజకవర్గంలోని మహదేవపూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం మండలాలు భూపాలపల్లి జిల్లాలోకి, మంథని, ముత్తారం, కమాన్‌పూర్ మండలాలు పెద్దపల్లి జిల్లాలోకి వెళ్తున్నాయి. మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం సిద్దిపేట జిల్లాకు మార్చగా, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, బెజ్జంకి మండలాలు కరీంనగర్‌కు కేటాయించారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాలు పెద్దపల్లి జిల్లాలో, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు జగిత్యాల జిల్లాలో, కరీంనగర్ నియోజకవర్గం పూర్తిగా కరీంనగర్ జిల్లాలోనే కొనసాగుతుండటంతో సదరు ఎమ్మెల్యేలు ఒకే జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
– ఎంపీల విషయానికొస్తే... కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ ఇకపై కరీంనగర్, హన్మకొండ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఏర్పడింది. అట్లాగే పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కొత్త జిల్లాల విభజన నేపథ్యంలో పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు, నిజామాబాద్ ఎంపీ కవిత ఇకపై నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సిందే.
– ఇక ఒక్కో ఎమ్మెల్సీ ఏకంగా 6 నుంచి 11 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు ఇకపై కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. శాసనమండలి చైర్మన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీచర్స్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి ప్రస్తుతం కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో వీరు ఏకంగా 11 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలు మూడేసి జిల్లాలుగా.. నిజామాబాద్ రెండు జిల్లాలుగా ఏర్పడుతున్నందున మొత్తం 11 జిల్లాలకు ఈ ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహించాల్సి రావడం విశేషం.
– జిల్లా పరిషత్ చైర్పర్సన్, డీసీసీబీ, డీసీఎంస్ చైర్మన్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌లోని మండలాలు ఆరు జిల్లాల్లోకి వెళుతున్నప్పటికీ ఆయా పదవులు గడువు ముగిసే వరకు వారి పరిధిలోనే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో వారంతా ఒకే జిల్లాకు ప్రాతినిధ్యం వహించడంతోపాటు సమావేశాలు నిర్వహించిన సమయంలో ఆయా స్థానిక, సహకార సంఘాల ప్రతినిధులు కరీంనగర్ జిల్లాకే రావాల్సి ఉంటుంది.
జిల్లా నుంచి 742 అభ్యంతరాలు
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి బుధవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 2564 అభ్యంతరాలు ప్రభుత్వ వెబ్సైట్లో నమోదవగా, అందులో ప్రస్తుత కరీంనగర్ జిల్లా నుంచి ఏకంగా 759 ఉండటం గమనార్హం. వీటిలోనూ అత్యధికంగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన కొత్త రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి ఏకంగా 514 అభ్యంతరాలు వెల్లడించడం గమనార్హం. అందులో మెజారిటీ అభిప్రాయాలు కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని రావడం విశేషం. మిగిలిన విషయానికొస్తే జిల్లాల ఏర్పాటుపై 195, మండలాల ఏర్పాటుపై 50 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి.