దౌల్తాబాద్‌ను మండలకేంద్రం చేయాలి
అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన, రాస్తారోకో
స్తంభించిన రాకపోకలు
హత్నూర: మేజర్ గ్రామ పంచాయతీ దౌల్తాబాద్‌ను మండల కేంద్రం చేయాలంటూ బుధవారం గ్రామస్తులు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. దౌల్తాబాద్ సర్పంచ్ ఎల్లదాస్, కాసాల సర్పంచ్ భర్త పూసల సత్యనారాయణగౌడ్, ఎంపీటీసీ భర్త సురేందర్ గౌడ్ తెలంగాణతల్లి చౌరస్తా వద్ద ఆమరణ నిరాహారదీక్షలో పాల్గొన్నారు.
ముందుగా వారు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో దౌల్తాబాద్ బంద్ నిర్వహిస్తూ తెలంగాణతల్లి చౌరస్తా వద్దకు చేరుకొని అంబేద్కర్, తెలంగాణతల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం హత్నూర మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తే దౌల్తాబాద్‌ను నూతన మండల కేంద్రం చేయాలంటూ ముగ్గురు టీఆర్ఎస్ నాయకులు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు సంఘీభావం ప్రకటిస్తూ సంగారెడ్డి-నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. హత్నూర మండలాన్ని విడగొట్టొవద్దని, ఒక వేళ విడగొడితే దౌల్తాబాద్‌ను మండల కేంద్రం చేసి, సంగారెడ్డి జిల్లాలో కలపాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు.
సాయంత్రం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి , టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కిషన్‌రెడ్డి, మరికొంత మంది నాయకులు ఆమరణ నిరాహారదీక్ష శిబిరం వద్దకు చేరుకొని దీక్ష విరమింపజేయాలని సూచించారు. దౌల్తాబాద్‌ను మండల కేంద్రం చేయడానికి తనవంతు కృషిచేస్తానని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హామీ ఇచ్చి, నిమ్మరసం ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు.
కార్యక్రమాల్లో అఖిలపక్షం నాయకులు కొన్యాల వెంకటేశం, హకీం, శ్రీనివాస్, ఇబ్రహిం, మహేష్, సాజిద్‌తోపాటు ఆయా పార్టీల నాయకులు వ్యాపారస్తులు స్వచ్ఛదంగా బంద్ పాటించి దీక్షకు మద్దతు పలికారు. దౌల్తాబాద్ చౌరస్తాలో నూతనంగా నిర్మిస్తున్న వాటర్‌ట్యాంక్‌పైకి ఆరుగురు యువకులు ఎక్కి దౌల్తాబాద్‌ను మండలంగా ప్రకటించాలని ఆందోళన చేపట్టడంతో ఎస్సై బాల్‌రెడ్డి వారికి నచ్చజెప్పి కిందకు దింపారు.
చింతల్‌చెరువును మండలం చేయాలంటూ రాస్తారోకో
మండలంలోని చింతల్ చెరువును మండల కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో వడ్డెపల్లి చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. హత్నూర మండలాన్ని విడగొట్టొవద్దని, ఒక వేళ విడదీస్తే చింతల్‌చెరువును మండల కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్చెరు, దౌల్తాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని రాస్తారోకోను విరమింపజేశారు.
సిరిపురను విడదీయొద్దు
హత్నూర మండలంలో ఉన్న సిరిపుర గ్రామ పంచాయతీని నూతనంగా ఏర్పడే చిలిప్‌చెడ్ మండలంలో కలపవద్దని అఖిలపక్షం నాయకులు సిరిపురలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.