ప్రభుత్వ అవినీతిని ఎండగట్టండి
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నపూసను గెలిపించాలి
– ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
– ప్రాధాన్యత ఓటు వైఎస్సార్సీపీకే వేయాలి
– మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి
అనంతపురం న్యూసిటీ : ‘సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారు. పరిశ్రమలు తెప్పించి ఉద్యోగం కల్పించడంతో పాటు భృతి కల్పిస్తామన్నారు. ఉద్యోగులు, అధికారులపై దాడులు మొదలుకుని, అవినీతిలో తారస్థాయికి చేరారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా తీసుకువస్తామని మోసం చేసింది. అలాగే అధికార పార్టీ చేసిన దారుణాలు, వంచనలను పట్టభద్రులకు తెలియజెప్పాలి’ అని ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డివిజన్ కన్వీనర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా జిల్లాలో అధికార పార్టీకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై సాక్షాత్తు సీఎం అసంతృప్తిగా ఉన్నారన్నారు.
గడిచిన రెండున్నరేళ్లలో ప్రజలను మభ్యపెట్టిన విధానాన్ని, అధికార దుర్వినియోగాన్ని పట్టభద్రులకు వివరించి, ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ఎండగడుతున్న జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాట పటిమను తెలియజేయాలన్నారు. ఉద్యోగ, కార్మిక సంఘాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటూ చేసిన కార్యక్రమాలను వివరించాలన్నారు. రాష్ట్రంలో పశ్చిమ రాయలసీలో మాత్రమే వైఎస్సార్సీపీ అభ్యర్థి పోటీస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపించాలన్నారు. ఉద్యోగ, కార్మిక సంఘాల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డికి అపార అనుభవం ఉందన్నారు.
అతడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు స్పెషల్ స్టేటస్ నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చి, ఇవాల అవసరం లేదని ప్యాకేజ్ ఉంటే సరిపోతుందని మాట్లాడిన తీరును ఓటర్లకు వివరించాలన్నారు. ప్రాధాన్యత ఓటు వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డికి వేయాలని, ఇక మిగితా ఓట్లు ఎవరికీ వేయరాదన్న విషయాన్ని ఓటర్లకు తెలియజేయాలన్నారు. పది రోజుల మాత్రమే సమయం ఉందని అన్ని డివిజన్ల కన్వీనర్లు, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాలు సమష్టిగా ప్రచారం చేయాలన్నారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీం మాట్లాడుతూ ప్రభుత్వానికి కళ్లునెత్తినెక్కి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు.
మైనార్టీలు చాలా మంది పట్టభద్రులుగా ఉన్నారని, వారిని కలసి ఎన్నికల్లో వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరాలన్నారు. మాజీ మేయర్ రాగే పరుశురాం మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీను గెలిపించి టీడీపీకి గుణపాఠం చెప్పాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నేత కొర్రపాటు హుస్సేన్‌పీరా, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయయాదవ్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, నగరాధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, మహిళా విభాగం నగరధ్యక్షురాలు శ్రీదేవి, విద్యార్థి విభాగం జిల్లా, నగర అధ్యక్షులు బండి పరుశురాం, జంగాలపల్లి రఫి, డివిజన్ కన్వీనర్లు చంద్రమోహన్‌రెడ్డి, రాధాకృష్ణ, చేపల హరి, పార్టీ నేతలు గోపాల్‌మోహన్, పసుపుల బాలకృష్ణారెడ్డి, చలపతి తదితరులు పాల్గొన్నారు.