మహారాష్ట్రను ముక్కలు కానివ్వం
సాక్షి, ముంబై: మహారాష్ట్రను ముక్కలు చేయాలని కంటున్న కలలు ఎన్నటికీ నెరవేరనివ్వబోమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కుండబద్దలు కొట్టారు. అధికార పత్రికైన సామ్నాలో బుధవారం రాసిన సంపాదకీయంలో బుధవారం మిత్రపక్షమైన బీజేపీని లక్ష్యంగా చేసుకుని పరోక్షంగా అనేక హెచ్చరికలు చేశారు. ‘రాష్ట్రాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రెండు రోజుల కిందట హుతాత్మ చౌక్వద్ద అన్నారు.
ఆవిధంగా చెప్పినందుకు ఆయనను మేము అభినందిస్తున్నాం. బీజేపీగానీ మరే పార్టీగానీ రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తే సహించం’ అని స్పష్టం చేశారు. ఇదిలాఉంచితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, శివసేన మధ్య వాగ్వాదం జరుగుతోంది. దీనికి తోడు సామ్నా సంపాదకీయంలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని పరోక్షంగా హెచ్చరించడంతో భవిష్యత్తులో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు పార్టీల మధ్య పొత్తు దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదని వారు పేర్కొంటున్నారు.