రంగాలవారీగా ‘విభజన’ లక్ష్యాలు
అన్ని శాఖలు, కలెక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలకు సీఎస్ సర్క్యులర్
పది పేజీల సర్క్యులర్‌తో పాటు తొమ్మిది నమూనా పత్రాలు
మే 31కల్లా ఎటువంటి ఇబ్బందుల్లేకుండా 2 రాష్ట్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలి
తెలంగాణకు, ఆంధ్రాకు వేర్వేరుగా చట్టాలు, నిబంధనలను ప్రతిపాదించాలి
విభజన పురోగతిపై ప్రతి శనివారం సీఎస్‌కు నివేదిక.. ప్రతి మంగళవారం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పనుల పూర్తికి రంగాలవారీగా లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పి.కె.మహంతి శుక్రవారం అన్ని శాఖలు, జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, స్వయంప్రతిపత్తి సంస్థలకు సర్క్యులర్ జారీ చేశారు. పది పేజీలతో కూడిన ఈ సర్క్యులర్‌కు రంగాలవారీగా వివరాల కోసం తొమ్మిది నమూనా పత్రాలను కూడా జతపరిచారు. మే 31వ తేదీకల్లా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా రెండు రాష్ట్రాలుగా విడిపోవడానికి అన్ని రంగాలు సిద్ధంగా ఉండాలని అందులో స్పష్టం చేశారు. విభజన పురోగతిపై అన్ని శాఖల నుంచి ప్రతి శనివారం సీఎస్‌కు నివేదిక పంపాలని తెలిపారు. ప్రతి మంగళశారం సీఎస్ అన్ని శాఖల అధికారులతో సమీక్షలు చేస్తారని వెల్లడించారు. ప్రతి శాఖలో విభజనకు, ప్రతి పనికి జవాబుదారీగా ఒకరిని నోడల్ అధికారిగా నియమించాలి.
- ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలు, నియంత్రణలకు సంబంధించి జాబితాలు సిద్ధం చేయాలి. ఈ చట్టాలు, నిబంధనలు, నియంత్రణలు ఇరు రాష్ట్రాల్లో అమలుకు అనుగుణంగా ఉంటాయో లేదో పరిశీలించాలి. అవసరం లేని చట్టాలు, నిబంధనల రద్దుకు ప్రతిపాదించాలి. వేర్వేరు చట్టాలు, నిబంధనలను ప్రతిపాదించాలి. ఈ ప్రక్రియను మార్చి 29వ తేదీలోగా పూర్తి చేయాలి.
- మార్చి 1కల్లా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫైళ్లను వేర్వేరు చేయాలి. ఇరు రాష్ట్రాల ఉమ్మడి ఫైళ్లను గుర్తించాలి. ప్రతి ఫైలుతోపాటు ప్రతి పేజీకీ నెంబరు వేయాలి. కరెంట్, నోట్ ఫైళ్లను మూడేసి ప్రతుల చొప్పున జిరాక్స్ తీయాలి.
- ప్రతి కార్యాలయంలో అన్ని సెక్షన్లు, యూనిట్లలో పర్సనల్ రిజిస్టర్లను మార్చి 25కల్లా విభజించాలి.
- శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, స్వయంప్రతిపత్తి సంస్థల్లోని రికార్డు రూమ్‌లలో ఫైళ్ల విభజనను ఏప్రిల్ 30కల్లా పూర్తి చేయాలి. ఈ కార్యాలయాల్లోని చరాస్థులైన చిన్న గుండు సూది నుంచి పెద్ద జనరేటర్లు, ఫర్నీచర్, వాహనాలు, కంప్యూటర్లు, ఫోన్ల లెక్కింపు ప్రక్రియను మార్చి 25కల్లా పూర్తి చేయాలి.
ఈ సంస్థల్లో మంజూరైన పోస్టులను మాత్రమే విభజనకు పరిగణనలోకి తీసుకోవాలి. అడ్హాక్, సూపర్‌న్యూమరీ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోవద్దు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేలా ఈ శాఖల స్వరూపాలు, మానవ వన రుల్లో సంస్కరణలు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించాలి. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిపైన పడే పనిభారాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన మార్పులతో ప్రతిపాదనలు చేయాలి
అనుబంధ రంగాలకు చెందిన విభాగాలన్నింటినీ ఒకే శాఖ పరిధిలోకి తెస్తూ ప్రతిపాదించాలి. ఈ ప్రతిపాదనలను మార్చి 29లోగా అపెక్స్ కమిటీకి సమర్పించాలి. మార్చి 1వ తేదీనాటికి మంజూరైన పోస్టుల వివరాలను సేకరించాలి. దీర్ఘకాలిక సెలవు, శిక్షణ, డిప్యుటేషన్, ఇతర విధులు, విదేశీ సర్వీసు, సస్పెన్షన్, అనధికారిక గైర్హాజర్‌లో ఉన్న ఉద్యోగులు, అధికారుల వివరాల సేకరణను ఈ నెల 18 కల్లా పూర్తి చేయాలి.
- జీహెచ్ఎంసీ పరిధిలోని స్థిరాస్తుల వివరాలను ఏప్రిల్ 18కి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డేటా బేస్‌లో నమోదు చేయాలి.
- వివిధ రకాల పనుల కాంట్రాక్టుల వివరాలను వేర్వేరుగా గుర్తించి ప్రస్తుత కాంట్రాక్టులకు సవరణలు చేయడానికి ప్రతిపాదించాలి.
- ప్రస్తుత పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల అమలుకు అవసరమైన బడ్జెట్‌ను అంచనా వేయాలి. ప్రతి శాఖలో కేంద్ర పథకాలు, విదేశీ సాయం, ఆర్థిక సంఘం నిధుల విడుదల, వ్యయం, వినియోగపత్రాలను ఏప్రిల్ 10కల్లా పూర్తి చేయాలి.
- ఐటీ, మౌలిక సదుపాయాలతో పాటు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే ప్రక్రియను మే 5కల్లా పూర్తిచేయాలి. ఐటీ ఆపరేషన్, నిర్వహణ కాంట్రాక్టు ఇరు రాష్ట్రాల్లోనూ కొనసాగించాలి.
- రెండు రాష్ట్రాల్లో ఆర్థిక అవసరాలను లోతుగా అధ్యయనం చేయాలి. ఆర్థిక లోటు, ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఉన్న అవకాశాలపై సమగ్ర నివేదిక మార్చి 29లోగా 14వ ఆర్థిక సంఘానికి పంపించాలి.