పట్టాలు తప్పిన రైలు: 12 మంది మృతి
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రోహ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగో థానే, రోహ స్టేషన్ల మధ్య నిది అనే గ్రామం వద్ద ఈ రోజు ఉదయం 10 గంటలకు దివా సావంత్వాది ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజన్‌తోపాటు నాలుగు బోగిలు పట్టాలు తప్పాయి.
ముంబైకు 120 కిలోమీటర్లు దూరంలోని కొంకణ్ రైల్వే మార్గంలో ఆ ప్రమాదం సంభవించిందని రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బందిని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై రైల్వే శాఖ ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు రూ. 50 వేలు, స్వల్ప గాయాలపాలైన వారికి రూ.10 వేలు నష్టపరిహారాన్ని అందించనున్నట్లు రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖార్గే ప్రకటించారు. రైలు ప్రమాదం కారణంగా కొంకణ్ రైల్వే మార్గంలో రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి.