‘మా ఇద్దరి మధ్య అంతకుమించి ఏం లేదు’
హిందీ టీవీ తారలు కవితా కౌశిక్, నవాబ్ షా ఆకస్మికంగా గత జూలైలో విడిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. మతం కారణంగానే వీరు విడిపోయారని ఊహాగానాలు వచ్చాయి. నవాబ్ వేరే మతానికి చెందిన వాడు కావడంతో పెళ్లికి కవిత తల్లిదండ్రులు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదని నవాబ్ తెలిపాడు.
‘మతం ఆధారంగా ఇలాంటి వదంతులు ఎందుకు పుట్టిస్తారో అర్థం కావడం లేదు. చాలా కాలంగా ఉన్న పొరపొచ్చాల వల్లే కవిత, నేను విడిపోయాం. మేమిద్దరం బలమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్లం. వయసు, మతం అనేవి ప్రేమకు అడ్డురావు. ఆడమగ కలిసి పనిచేసే ముంబై లాంటి మెట్రోనగరాల్లో ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. కవిత, నేను ఐదేళ్లు కలిసివున్నాం. ఇప్పుడు ఎవరు దారులు వారు చూసుకున్నాం. ఇంతకుమించి ఏం జరగలేద’ని నవాబ్ వెల్లడించాడు.
కవిత నుంచి విడిపోయిన నవాజ్ లాస్ ఏంజెలెస్ కు చెందిన సినిమాటోగ్రాఫర్ దియా బాల్కీకు దగ్గరయ్యాడు. డాన్ 2, దిల్ వాలే సినిమాల్లో నవాబ్ నటించాడు. కవిత కూడా తన పాత స్నేహితుడు రోనిత్ బిశ్వాస్ తో ప్రేమాయణం సాగిస్తోంది. కొత్త జీవితంలో నవాబ్ సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించింది.