Djibouti
-
చుట్టుముడుతున్న చైనా!
జిబూటీలో తొలి సైనిక స్థావరం (సాక్షి నాలెడ్జ్ సెంటర్) హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఆధిపత్యం సంపాదించడానికి ఆఫ్రికా ‘కొమ్ము’ దేశమైన జిబూటీలో చైనా సైనిక స్థావరం ఏర్పాటుచేసుకోవడం ఆసియాలో ఆందోళనకలిగించే పరిణామంగా మారింది. ప్రపంచ ఆర్థికశక్తిగా ఆవిర్భవించి, తనతో పోటీపడుతున్న ఇండియాను అన్ని విధాలా దెబ్బదీయడానికే చైనా తన తొలి విదేశీ సైనిక స్థావరం నిర్మిస్తోందని రక్షణరంగ నిపుణులు అంచనావేస్తున్నారు. అంతేకాకుండా భారత్ చుట్టూ ఉన్న పొరుగు దేశాలతో చైనాకున్న సైనిక ఒప్పందాల కారణంగా ఆయా దేశాల్లో చైనా సైనిక ఉనికి కనిపిస్తోంది. రోజూ కోట్లాది డాలర్ల విలువైన ముడి చమురును వందలాది నౌకలు తీసుకెళ్లే ఆడెన్ సింధుశాఖకు సమీపంలోని బుల్లి దేశం జిబూటీ. తొమ్మిది లక్షల జనాభా ఉన్న ఈ ముస్లిం దేశంలో ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జపాన్‌కు సైనిక స్థావరాలున్నాయి. మారిన అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల వల్ల చైనా స్థావరం ఏర్పాటు పలు దేశాలకు గుబులు పుట్టిస్తోంది. ఎడారి ప్రాంతమైన తన భూభాగాన్ని అద్దె–లీజు పద్ధతిపై స్థావరాల ఏర్పాటుకు ఇచ్చి జిబూటీ లబ్ధిపొందుతోంది. మంగళవారం దక్షిణ చైనా రేవుపట్నం జాంజియాంగ్ నుంచి రెండు భారీ నౌకలు జిబూటీకి చైనా దళాలతో బయల్దేరాయని పాశ్చాత్య మీడియా తెలిపింది. అయితే ఎన్ని ఓడల్లో తమ దళాలు కొత్త స్థావరానికి వెళుతున్నదీ చైనా వార్తా సంస్థలు వెల్లడించలేదు. ‘జాతీయ భద్రతకే’ సైనిక పాటవం పెంచుకుంటున్నామన్న చైనా! కీలక ప్రాంతంలో చైనా తన తొలి అంతర్జాతీయ సైనిక స్థావరం నెలకొల్పుతోందని అందరూ చెబుతుండగా, ఓడ దొంగలు, ఉగ్రవాదుల నుంచి భద్రత కల్పించడానికి ఈ ప్రాంతంలో తిరిగే తమ యుద్ధనౌకల కోసమే ఈ ‘మద్దతు స్థావరం’ నిర్మిస్తున్నామని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయం బుధవారం తెలిపింది. అంతేగాక, చైనా తన సైనిక పాటవాన్ని పెంచుకోవడంలో మౌలిక లక్ష్యం జాతీయ భద్రతేగాని ప్రపంచాధిపత్యం కాదని కూడా ఈ పత్రిక వాదిస్తోంది. కాని, గత రెండు నెలల్లో హిందూ మహాసముద్రంలో జలాంతర్గాములు, విధ్యంసక నౌకలు, కీలక సైనిక సమాచారం సేకరించే నావలు సహా చైనాకు చెందిన పది పదిహేను యుద్ధనౌకలు తిరగడాన్ని భారత నేవీ గుర్తించింది. 1992 నుంచి ఏటా అమెరికా, జపాన్‌తో కలసి మలబార్ సైనిక విన్యాసాల నిర్వహణ ద్వారా ఈ ప్రాంత జలాల్లో మూడు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక సహకారానికి ప్రతిస్పందనగానే చైనా జిబూటీలో సైనిక స్థావరం నిర్మిస్తోందని భావిస్తున్నారు. హిందూ మహాసముద్రంలోని నౌకా మార్గాలు ప్రపంచంలోనే అత్యంత కీలకమైనవి. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ ఇంథన అవసరాలు తీర్చుకోవడానికి పశ్చిమాసియా నుంచి దిగుమతిచేసుకునే ముడి చమురుపైనే అత్యధికంగా ఆధారపడుతోంది. జిబూటీకి సమీపంలోని సింధుశాఖల ద్వారానే ఈ క్రూడాయిల్ ట్యాంకర్లు భారత్‌కు వెళతాయి. ఈ నేపథ్యంలో అక్కడ చైనా స్థావరం నిర్మాణం ఇండియా ప్రయోజనాలకు ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్, పాక్ మీదుగా ఓబీఓఆర్ పేరిట రహదారి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. పాక్–చైనా ప్రత్యేక ఆర్థిక కారిడార్ ఏర్పాటుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇంకా శ్రీలంక, బంగ్లాదేశ్, పాక్‌లో అనేక పోర్టులు, మౌలిక సదుపాయాలు చైనా నిర్మిస్తోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే జిబూటీ సైనికస్థావరం భారత్‌కు భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారుతుందని భావించడం సబబే. -
హార్న్ ఆఫ్ ఆఫ్రికా
జిబౌటి హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాలలో ఒకటి... జిబౌటి. ఈ దేశానికి ఉత్తరంలో ఎరిట్రియా, దక్షిణంలో ఇథియోపియా, ఆగ్నేయంలో సోమాలియా దేశాలు ఉన్నాయి. సుదీర్ఘకాలం పాటు ఫ్రెంచ్ పాలనలో ఉంది జిబౌటి. 1966 ఆగస్ట్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు చార్లెస్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్వాతంత్య్రం కావాలంటూ నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ‘ఫ్రెంచ్ అధీనంలో ఉంటారా? స్వాతంత్య్రం కావాలా?’ అనే అంశంపై ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ లూయిస్ సాగెట్ రెఫరెండం నిర్వహించారు. 60 శాతం మంది ఫ్రెంచ్ పాలనలోనే ఉండడానికి మొగ్గు చూపారు. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. నిరసనలు ఆగలేదు. స్వాతంత్య్రకాంక్ష ఏదో ఒక ఉద్యమ రూపంలో వ్యక్తమవుతూనే ఉండేది. ఎట్టకేలకు 1977లో ఫ్రెంచ్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందింది జిబౌటి. ఒకవైపు స్వాతంత్య్ర సంబరాలు, మరోవైపు ‘ఈ చిన్న దేశం... అంతర్యుద్ధాలతో కుప్పకూలిపోవడం ఖాయం. దేశానికి భవిష్యత్ లేదు’ అనే జోస్యాలు మొదలయ్యాయి. దేశంలోని నాన్ సోమాలి అఫార్స్-సోమాలి ఇస్సాస్ మధ్య ఉన్న విభేదాలు... దేశప్రగతికి అడ్డుపడతాయనే అంచనా ఉండేది. అయితే స్వాతంత్య్రానంతరం ఈ రెండు వర్గాల మధ్య ‘అధికార మార్పిడి’ ఫార్ములా విజయవంతంగా అమలుకావడంతో... ఆ అనుమానాలు, అంచనాలేవీ నిజం కాలేదు. 1991లో దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆ తరువాత జరిగిన చర్చలతో శాంతియుత వాతావరణం ఏర్పడింది. పరిపాలనపరంగా జిబౌటి ఆరు విభాగాలుగా విభజించబడింది. వీటిని 11 జిల్లాలుగా విభజించారు. 820 రకాల మొక్కలు, 360 రకాల పక్షులు, 66 రకాల క్షీరదాలు ఉన్న జిబౌటి జీవవైవిధ్యానికి కొంగుబంగారంగా నిలిచింది. గోడ పర్వతాల్లోని ‘డే ఫారెస్ట్ నేషనల్ పార్క్’ జీవవైవిధ్యానికి మరో కానుక. కళల విషయానికి వస్తే... జిబౌటి సంగీతానికి మంచి ప్రాచుర్యం ఉంది. మొదట్లో ఇతర ప్రాంతాల ప్రభావం ఉన్నప్పటికీ ఆ తరువాత తనదైన శైలితో ప్రత్యేకతను నిలుపుకుంది. జిబౌటి కవిత్వానికి ఘనమైన చరిత్ర ఉంది. వంద పంక్తుల కవిత ‘గబె’కు జిబౌటి సాహిత్యంలో ప్రత్యేకత ఉంది. తక్కువ వర్షపాతం వల్ల పండ్లు, కూరగాయలు మాత్రమే పండిస్తారు. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. అంతర్యుద్ధం తాలూకు ప్రతికూల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడినప్పటికీ, ఆ తర్వాత రాజకీయ స్థిరత్వం ఏర్పడడంతో పరిస్థితి కుదుటపడింది. స్వాతంత్య్రనంతరం జిబౌటి ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నిరుద్యోగం, పేదరికం సమస్యలు సవాళ్లుగా నిలిచాయి. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ ‘సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఇన్ ది వరల్డ్’ జాబితాలో చోటు చేసుకుంది. టాప్ 10 1. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్న దేశాలలో జిబౌటి ఒకటి. 2. రాజధాని జిబౌటి ఆఫ్రికా ఖండంలోని చిన్న పట్టణాలలో మూడవది. 3. {ఫెంచ్, ఇస్లాం సంప్రదాయం, సంస్కృతుల ప్రభావం భవననిర్మాణ కళలో కనిపిస్తుంది. 4. ఉప్పునీటి సరస్సు లక్ అసల్ ‘ఉప్పు’ ఇంటి అవసరాలకు ఉపయోగపడడమే కాదు వాణిజ్యానికి కూడా ఉపయోగపడుతుంది. 5. జిబౌటిలో మాత్రం క్రిస్మస్ను జనవరి 7న జరుపుకుంటారు. 6. సూర్యోదయం తరువాత ట్యాక్సీ రేట్లు పెరుగుతాయి. 7. మూడింట రెండు వంతుల మంది దేశరాజధానిలోనే నివసిస్తారు. 8. ఫ్రెంచ్, అరబ్బీలతో పాటు సోమాలి, అఫర్లను మాట్లాడతారు. 9. కన్స్ట్రక్షన్, అగ్రికల్చరల్ ప్రాసెసింగ్, సాల్ట్మైనింగ్, పెట్రోలింగ్ రిఫైనరీ... మొదలైనవి దేశంలో ప్రధాన పరిశ్రమలు. 10. దేశంలో అక్షరాస్యత 68 శాతం. -
జిబౌతికి 350 మంది భారతీయులు
ఘర్షణలతో అట్టుడుకుతున్న యెమెన్‌లోని ఆడెన్ నుంచి బుధవారం భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ సుమిత్ర నౌకలో 350 మంది భారతీయులు జబౌతి దేశానికి చేరుకున్నారు. వీరు రెండు భారత వాయుసేన విమానాల్లో బుధవారం రాత్రి పొద్దుపోయాక స్వదేశానికి చేరుకుంటారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీటర్లో తెలిపారు. యెమెన్ రాజధాని సనాలో విమానాశ్రయంలో భారత్ నుంచి వెళ్లిన విమానానికి దిగేందుకు అనుమతి ఇవ్వకపోవటంతో 320 మంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. తమను త్వరగా స్వదేశానికి చేర్చేందుకు ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని సనాలో చిక్కుకుపోయిన రవికుమార్ అనే బెంగళూరు వాసి వాట్సప్ సందేశం ద్వారా కోరారు. భారతీయుల తరలింపును పర్యవేక్షించేందుకు విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ బుధవారం యెమెన్ పొరుగు దేశమైన జిబౌతికి చేరుకున్నారు. ఆడెన్లోని షియా రెబెల్స్ స్థావరాలపై సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ దేశాల కూటమి బుధవారం కూడా యుద్ధవిమానాల నుంచి బాంబుల వర్షం కురిపించింది. హోదేబా నగరంలోని డెయిరీపై జరిగిన బాంబు దాడిలో నలుగురు పౌరులు, మేదీలో జరిగిన దాడిలో ఆరుగురు చనిపోయారని వైద్యులు చెప్పారు.