చుట్టుముడుతున్న చైనా!
జిబూటీలో తొలి సైనిక స్థావరం
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఆధిపత్యం సంపాదించడానికి ఆఫ్రికా ‘కొమ్ము’ దేశమైన జిబూటీలో చైనా సైనిక స్థావరం ఏర్పాటుచేసుకోవడం ఆసియాలో ఆందోళనకలిగించే పరిణామంగా మారింది. ప్రపంచ ఆర్థికశక్తిగా ఆవిర్భవించి, తనతో పోటీపడుతున్న ఇండియాను అన్ని విధాలా దెబ్బదీయడానికే చైనా తన తొలి విదేశీ సైనిక స్థావరం నిర్మిస్తోందని రక్షణరంగ నిపుణులు అంచనావేస్తున్నారు.
అంతేకాకుండా భారత్ చుట్టూ ఉన్న పొరుగు దేశాలతో చైనాకున్న సైనిక ఒప్పందాల కారణంగా ఆయా దేశాల్లో చైనా సైనిక ఉనికి కనిపిస్తోంది. రోజూ కోట్లాది డాలర్ల విలువైన ముడి చమురును వందలాది నౌకలు తీసుకెళ్లే ఆడెన్ సింధుశాఖకు సమీపంలోని బుల్లి దేశం జిబూటీ. తొమ్మిది లక్షల జనాభా ఉన్న ఈ ముస్లిం దేశంలో ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జపాన్‌కు సైనిక స్థావరాలున్నాయి.
మారిన అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల వల్ల చైనా స్థావరం ఏర్పాటు పలు దేశాలకు గుబులు పుట్టిస్తోంది. ఎడారి ప్రాంతమైన తన భూభాగాన్ని అద్దె–లీజు పద్ధతిపై స్థావరాల ఏర్పాటుకు ఇచ్చి జిబూటీ లబ్ధిపొందుతోంది. మంగళవారం దక్షిణ చైనా రేవుపట్నం జాంజియాంగ్ నుంచి రెండు భారీ నౌకలు జిబూటీకి చైనా దళాలతో బయల్దేరాయని పాశ్చాత్య మీడియా తెలిపింది. అయితే ఎన్ని ఓడల్లో తమ దళాలు కొత్త స్థావరానికి వెళుతున్నదీ చైనా వార్తా సంస్థలు వెల్లడించలేదు.
‘జాతీయ భద్రతకే’ సైనిక పాటవం పెంచుకుంటున్నామన్న చైనా!
కీలక ప్రాంతంలో చైనా తన తొలి అంతర్జాతీయ సైనిక స్థావరం నెలకొల్పుతోందని అందరూ చెబుతుండగా, ఓడ దొంగలు, ఉగ్రవాదుల నుంచి భద్రత కల్పించడానికి ఈ ప్రాంతంలో తిరిగే తమ యుద్ధనౌకల కోసమే ఈ ‘మద్దతు స్థావరం’ నిర్మిస్తున్నామని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయం బుధవారం తెలిపింది. అంతేగాక, చైనా తన సైనిక పాటవాన్ని పెంచుకోవడంలో మౌలిక లక్ష్యం జాతీయ భద్రతేగాని ప్రపంచాధిపత్యం కాదని కూడా ఈ పత్రిక వాదిస్తోంది. కాని, గత రెండు నెలల్లో హిందూ మహాసముద్రంలో జలాంతర్గాములు, విధ్యంసక నౌకలు, కీలక సైనిక సమాచారం సేకరించే నావలు సహా చైనాకు చెందిన పది పదిహేను యుద్ధనౌకలు తిరగడాన్ని భారత నేవీ గుర్తించింది.
1992 నుంచి ఏటా అమెరికా, జపాన్‌తో కలసి మలబార్ సైనిక విన్యాసాల నిర్వహణ ద్వారా ఈ ప్రాంత జలాల్లో మూడు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక సహకారానికి ప్రతిస్పందనగానే చైనా జిబూటీలో సైనిక స్థావరం నిర్మిస్తోందని భావిస్తున్నారు. హిందూ మహాసముద్రంలోని నౌకా మార్గాలు ప్రపంచంలోనే అత్యంత కీలకమైనవి. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ ఇంథన అవసరాలు తీర్చుకోవడానికి పశ్చిమాసియా నుంచి దిగుమతిచేసుకునే ముడి చమురుపైనే అత్యధికంగా ఆధారపడుతోంది.
జిబూటీకి సమీపంలోని సింధుశాఖల ద్వారానే ఈ క్రూడాయిల్ ట్యాంకర్లు భారత్‌కు వెళతాయి. ఈ నేపథ్యంలో అక్కడ చైనా స్థావరం నిర్మాణం ఇండియా ప్రయోజనాలకు ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్, పాక్ మీదుగా ఓబీఓఆర్ పేరిట రహదారి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. పాక్–చైనా ప్రత్యేక ఆర్థిక కారిడార్ ఏర్పాటుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇంకా శ్రీలంక, బంగ్లాదేశ్, పాక్‌లో అనేక పోర్టులు, మౌలిక సదుపాయాలు చైనా నిర్మిస్తోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే జిబూటీ సైనికస్థావరం భారత్‌కు భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారుతుందని భావించడం సబబే.