టీఆర్ఎస్ను తిట్టారా? పొగిడారా?..
హైదరాబాద్ : తరచుగా సొంత పార్టీని ఇరుకున పెట్టేలా అధికార టిఆర్ఎస్కు అనుకూలించేలా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి మరోసారి పరోక్షంగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జిల్లాల పునర్ వ్యవస్ధీకరణపై కాంగ్రెస్ నేతలు డీకె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, సంపత్ కుమార్ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా జానారెడ్డి ప్రసంగించారు.
అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించలేక టీఆర్ఎస్ సర్కార్ కొత్త జిల్లాల పేరుతో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజాభిప్రాయం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంత వరకు బాగానే ఉంది... కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా తీరును ప్రజలు వ్యతిరేకించకుండా ఇంకా సీఎం కేసీఆర్ హామీల అమలుపై ఆశతో ఉన్నారని కూడా జానా వ్యాఖ్యానించారు.
ఐదు లక్షల ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు పెండింగ్లో ఉన్నా లబ్ధిదారులు కేసిఆర్ సర్కార్ ప్రశ్నించడం లేదని... అయితే కాంగ్రెస్ నేతలం మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని అన్నారు. జానారెడ్డి ఎవరికి అనుకూలంగా, ఎవరికి ప్రతికూలంగా మాట్లాడారనేది అక్కడున్న కొంతమందికి అర్థం కాలేదట. దీంతో సొంతపార్టీలోనే జానా వైఖరి ఏమిటో తెలియక అయోమయం నెలకొంది.ఇంతకీ జానారెడ్డి టీఆర్ఎస్ను తిట్టారా? పొడిగారా?