మిన్నంటిన ఆందోళనలు
ఐఎఎస్ రవి మృతి దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్
సీఎంను నివేదిక కోరిన ఏఐసీసీ చీఫ్ సోనియా
మంత్రి మండలి సహచరుల నుంచి సైతం ‘సీబీఐ’ ఒత్తిడి
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరిన విపక్షాలు
బెంగళూరు ఐఏఎస్ అధికారి డి.కె.రవి మృతి చుట్టూ ఉన్న అనుమానాలను తీర్చుకునేందుకు అటు ఆయన తల్లిదండ్రులు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు ఐఏఎస్ అధికారుల నుంచి సైతం రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలు గురువారం సైతం డి.కె.రవి అనుమానాస్పద మృతి పై తమ ఆందోళనలను కొనసాయించాయి. సీఐడీ దర్యాప్తుతో నిజానిజాలు బయటపడే అవకాశం లేదని, అందువల్ల ఈ కేసును తప్పని సరిగా సీబీఐకి అప్పగించాల్సిందేనని డిమాండ్ చేశా యి. సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఎందుకు ఇంతగా సంశయిస్తోంది, ప్రభుత్వానికి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేకపోతే సీబీఐకి కేసును అప్పగించడానికి వెనకడుగు వేయాల్సిన అవసరం ఏముం ది? అని అన్ని ప్రజా సంఘాలు ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నాయి. సామాజిక అనుసంధాన వేదికల్లో కూడా డి.కె.రవి మృతి కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. ఇక డి.కె.రవి కుటుంబ సభ్యులు సైతం సీఐడీ విచారణపై తమకు నమ్మకం లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించని నేపథ్యంలో తమకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదంటూ ప్రభుత్వానికి తమ ఆవేదనను విన్నవించుకున్నారు. ఈ డిమాండ్లన్నీ ఒక ఎత్తయితే కాంగ్రెస్ పార్టీలో సుప్రీంగా వ్యవహరించే హైకమాండ్ సైతం డి.కె.రవి ృుతికి సంబంధించిన అంశంపై నివేదికను కోరింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఫోన్ చేసి ఈ ఉదంతానికి సంబంధించిన నివేదిక కో రినట్లు సమాచారం. అంతేకాక డి.కె.రవి మృతి అంశం పై ప్రజల్లో మరింత ఆగ్రహావేశాలు తలెత్తకముందే సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రి మండలి సహచరుల నుంచి సైతం...
ఇక గురువారమిక్కడి శాసనసభ ఆవరణలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సై తం నంబర్-2 స్థానంలో ఉన్న ఇద్దరు మంత్రులు తప్పితే మిగతా అందరూ డి.కె.రవి మృతి కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించినట్లు తెలుస్తోంది. కేసును సీబీఐకి అప్పగించకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి వస్తోంది, ఈ పరిణామం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సమస్యల్లోకి నెట్టేస్తుందని మంత్ర వర్గ సహచరులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించారు. దీంతో డి.కె.రవి మృతి కేసును సీబీఐకి అప్పగించే దిశగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆలోచనలో పడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
సీబీఐ దర్యాప్తుకు ఆదేశించండి
ఐఎఎస్ అధికారి డి.కె.రవి మృతి కేసు దర్యాప్తును సీబీఐ కి అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్‌ను విపక్షాలు కోరాయి. డి.కె.రవి మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేంత వరకూ నిరసనను కొనసాగిస్తామంటూ ఉభయసభల్లోని విపక్ష సభ్యులు తేల్చి చె ప్పడంతో సభా కార్యక్రమాలకు గురువారం కూడా అంతరాయం కలిగింది. దీంతో సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అనంతరం విపక్ష నేతలు జగదీష్ శెట్టర్, కుమారస్వామి, కె.ఎస్ ఈశ్వరప్ప, బసవరాజ్హొరట్టిలు తమ పార్టీ సభ్యులతో కలిసి విధానసౌధాలోని గాంధీ విగ్రహం వద్ద సమావేశమయ్యారు. కొద్ది సేపు అక్కడ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ డీ.కే రవి కేసును సీబీఐకు అప్పగించాలని నినాదాలు చేశారు. ప్ర భుత్వ వైఖరికి నిరసనగా నలుపు రంగు బ్యాడ్జీలు ధరిం చి పాదయాత్రగా రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ వజు భాయ్ రుడాభాయ్ వాలాను కలిసి రవి కేసును సీబీఐకి అప్పగించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వినతిపత్రాన్ని అందించారు. ‘అత్యంత ప్రతిభావంతుడైన ఐఏఎస్ అధికారి డీ.కే రవి మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన మరణానికి ముందు రాష్ట్ర మంత్రి మండలిలోని ఇద్దరు మంత్రులు సభ్యులుగా గల నిర్మాణరంగ సంస్థల ప్రతినిధుల నుంచి డీ.కే రవికి బెదిరింపులు వచ్చాయి. అందువల్ల ప్రభుత్వ ఆధీనంలోని సీఐడీ దర్యాప్తు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండ దు. ఆలస్యం చేయకుండా సీబీఐతో ఈ కేసును దర్యాప్తు చేయించడం వల్ల మరణం పట్ల ఉన్న సందేహాలు తొలిగి పోతాయి.’ అని కేసును సీబీఐ అప్పగించాల్సిన ఆవశ్యకతను వివరించారు.
మొదట నివేదిక అందించమని కోరుతా : వజుభాయ్
విపక్ష సభ్యుల నుంచి వినతి పత్రం అందుకున్న అనంతరం గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా మాట్లాడుతూ...‘డీ.కే రవి మృతికి సంబంధించి ఓ నివేదికను నా కు అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాను. నివేదిక అందిన తర్వాత కేసును సీబీఐకి అప్పగించాలా వద్ద అన్న దానిపై ప్రభుత్వాన్ని అదేశించే విషయమై ఓ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటా.’ అని విపక్షనాయకులకు భరోసా ఇచ్చారు.
ప్రభుత్వానికి ముందే తెలుసు : కుమారస్వామి
డీ.కే రవి మృతికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఆయన సహచరులలో కొంతమందికి ముందే సమాచారం తెలుసునని కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం నుంచి ఇప్పటి వరకూ వివిధ సందర్భాల్లో సీఎం సిద్ధు, హోంశాఖ మంత్రి కే.జే జార్జ్‌లు చేసిన ప్రకటనలు, వివిధ సందర్భాల్లో వారి ప్రవర్తన, వారి మాటలను బట్టి ఈ విషయం స్పష్టమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.