బెంగళూరు: కర్ణాటక వాణిజ్యపన్నుల అడిషనల్ కమిషనర్ డీకె రవి అనుమానాస్పద మృతిపై కర్ణాటక ఐఏఎస్ ఆఫీసర్లు ఆన్ లైన్ లో పోరాటానికి సిద్ధపడ్డారు. నిజాయితీపరుడైన తమ సహచరుని మృతిపై సీబీఐ విచారణను కోరుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక ఆన్లైన్ పిటిషన్పై సంతకాలు చేశారు. వీరి పోరాటానికి మద్దతుగా ఉత్తిష్ట భారతి అనే స్వచ్ఛంద సంస్థ దీనిపై ఆన్లైన్ ప్రచారాన్ని చేపట్టింది. దీంతో ఈ పిటిషన్పై ఇప్పటికే దాదాపు పధ్నాలుగు లక్షల మంది ఐఏఎస్ ఆఫీసర్లు సంతకాలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విచారణ మీద తమకు నమ్మకంలేదన్నారు ఐఏఎస్ ఆఫీసర్ ఎం.మదన్ గోపాల్. డీకే రవి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికి మూడు సార్లు రవిమీద హత్యాప్రయత్నాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. దీన్ని తాము సహించమనీ, తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని గోపాల్ డిమాండ్ చేశారు.
యువ ఐఏఎస్ ఆఫీసర్ అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీ ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు గళమెత్తాయి. ప్రభుత్వం నిరాకరించడంతో ధర్నాకూడా నిర్వహించాయి. అయినా ప్రభుత్వం ససేమిరా అంది. మరోవైపు మృతుని తల్లిదండ్రులు తమ కుమారుని మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.