సోమవారం నిర్ణయం- సీఎం
బెంగళూరు: యువ ఐఏఎస్ ఆఫీసర్ డీకే రవి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకు అప్పగించాలా వద్దా అనే విషయంలో సోమవారం నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఇప్పటికే సీఐడీ దర్యాప్తు చేస్తున్న ఈ కేసుపై ప్రభుత్వ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
మరోవైపు డీకే రవి మృతిపై కొత్త కోణం వార్తల్లో నిలుస్తోంది. ఆయన తన స్నేహితురాలికి పంపిన వాట్సాప్ సందేశాల్లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సంకేతాలున్నాయని సీఐడి భావిస్తోంది. దీనికి సంబంధించి రవి వాట్సాప్ మెసేజ్ లను సీఐడి ఉటంకింస్తోంది. రవి బ్యాచ్ మేట్, మహిళా ఐఏఎస్తో సన్నిహితంగా ఉండేవానీ, ఈ విషయంలో భార్యభర్తల మధ్య వివాదం కూడా నడిచిందని, ఈ విభేదాలే అతని ఆత్మహత్యకు దారి తీసి ఉంటాయన్న కోణంలో సీఐడీ విచారణను సాగిస్తోంది. చఅయితే ఈ విషయాలను డీకే రవి భార్య, కుసుమ, మామ ఖండిస్తున్నారు. అలాంటిదేమీ లేదని.., ఉంటే తమకు కచ్చితంగా షేర్ చేసుకునేవాడని అంటున్నారు. కేసును తప్పు దోవ పట్టించేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, రవి మరణాన్ని తట్టుకోలేని అతని అత్త తీవ్ర అస్వస్థతకు లోనై హార్ట్ ఎటాక్తో కన్నుమూశారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం డీకె రవి ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. దీనికి నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా సీబీఐ విచారణ జరపించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య కు సూచించిన సంగతి తెలిసిందే.