సాక్షి, బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెలకొల్పిన అమ్మ క్యాంటీన్లు ఇప్పుడు పలు రాష్ట్రాలకు ఆదర్శం అవుతున్నాయి. పేద ప్రజలకు అవసరమైన ఆహారాన్ని చౌక ధరలకు అందించేందుకు పలు రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు తరహాలో టిఫిన్లు, భోజనాలు సరసమైన ధరలకు సరఫరా చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు స్కీములు నిర్వహిస్తుండగా, తాజాగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చౌక ధరలకు ఆహారాన్ని సరఫరా చేసే క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది.
కర్ణాటకలో బుధవారం 101 పేదల క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో కొన్నింటిని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఓ క్యాంటీన్‌లో సీనియర్ నేతలతో కలసి భోజనం కూడా చేశారు. ఒక్కో క్యాంటీన్ రోజుకు మూడు వందల మంది ఐదు వందల మంది వరకు భోజన వసతిని కల్పిస్తుంది. ఇందిర పేరిట ఏర్పడిన ఈ క్యాంటీన్లలో టిఫిన్‌ను ఐదు రూపాయలకు, భోజనాన్ని పది రూపాయలకు వడ్డిస్తారు. ఎంపిక చేసిన కొన్ని క్యాంటీన్లలో టిఫిన్, భోజనాలు, కూరలు 25 రకాల వరకు ఉంటాయి. ఎక్కువ వాటిలో తక్కువ రకాలే ఉన్నప్పటికీ రోజుకో వెరైటీ ఉండేలా చూస్తారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 27 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కో కిచెన్ చొప్పున ఏర్పాటు చేశారు. ఈ కిచెన్ పలు క్యాంటీన్లకు ఆహారాన్ని సరఫరా చేస్తాయి. బెంగళూరు నగరంలోని ప్రతి వార్డులో ఓ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. టిఫిన్‌కు ఎక్కువగా ఇడ్లీలు, లంచ్‌కు రైస్, సాంబార్ ఎక్కువగా సరఫరా చేస్తారు. ఒక్కో క్యాంటీన్‌ను వేగంగా ఎనిమిది రోజుల్లోనే నిర్మించారు. అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 27 కిచెన్లలో 5 కిచెన్లను స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు ప్రత్యేకంగా కేటాయించారు. ఈ ఇందిర క్యాంటీన్లు మనకు ఎక్కడ దగ్గర ఉన్నాయో తెలియకపోతే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. ఎక్కడెక్కడ ఉన్నాయో యాప్ తెలియజేయడమే కాకుండా ఈ రోజు మెనూ ఏమిటో కూడా తెలియజేస్తోంది. క్యాంటీన్ రుచులనుబట్టి వినియోగదారులు రేటింగ్‌లు కూడా ఇవ్వొచ్చు. బాగోలేకపోతే యాప్ ద్వారానే ఫిర్యాదులు పంపవచ్చు.