Indira Canteen
-
బొద్దింకతో పబ్లిసిటీ స్టంట్.. కట్ చేస్తే..
సాక్షి, బెంగళూరు: ఓ యువకుడు బొద్దింక తెచ్చాడు.. ఎవరూ గమనించడం లేదనుకుని క్యాంటీన్లోని ఆహార పదార్థాల్లో వదిలాడు.. వంటకాల్లో బొద్దింక ఉంది.. ఇక్కడి ఆహారాన్ని ఎవరూ తినొద్దంటూ కాసేపు హల్చల్ చేశాడు.. దానికి తోడు యువకుడితో గొంతు కలిపారు అతని మిత్రులు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు వచ్చి క్యాంటీన్లోని సీసీ కెమెరా ఫుటేజిని పరిశీలించారు.. ఆ పని చేసింది సదరు యువకుడు, అతని స్నేహితులు అని రుజువవడంతో కటకటాల వెనక్కి చేరారు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి జరిగింది. హేమంత్, దేవరాజ్ అనే ఇద్దరు ఆటో డ్రైవర్లు మరో ఇద్దరితో కలిసి నగరంలోని కామాక్షిపాల్యలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరా క్యాంటీన్లో భోజనం చేసేందుకు శుక్రవారం వెళ్లారు. చిన్నపాటి గొడవ సృష్టిద్దామనుకుని వడ్డించిన పదార్థంలో బొద్దింక వచ్చిందంటూ హోటల్ సిబ్బందితో బెదిరింపులకు దిగారు. హోటల్‌కు వచ్చిన కస్టమర్లను అక్కడ భోజనం చేయవద్దంటూ హడావిడి చేశారు. విషయం పోలీసులకు చేరడంతో హోటల్‌కు వచ్చి ఆరా తీశారు. నగర పౌర సేవా సంస్థ బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) సబ్సిడీ ధరలకు ఆహారం అందించేందుకు ఈ క్యాంటీన్లను నిర్వహిస్తోంది. వారిని సంప్రదించగా ఈ గొడవకు సంబంధించిన వీడియో ఫుటేజిని పోలీసులకు అందజేసింది. దాన్ని పరిశీలించగా హేమంత్ బొద్దింకను తీసుకొచ్చి ఆహార పదార్థాల్లో వదిలాడని నిర్ధారణ అయింది. అతనితో వచ్చిన దేవరాజ్‌కు విషయం తెలిసినా అతను కూడా హేమంత్ చర్యలను సమర్థించాడు. దీంతో హేమంత్, దేవరాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పబ్లిసిటీ కోసమే ఇలా చేశామని వారు విచారణలో అంగీకరించారని పోలీసులు తెలిపారు. -
ఇందిరాక్యాంటీన్ అల్పాహారంలో బొద్దింక
జయనగర(కర్ణాటక): ఇందిరా క్యాంటీన్లో అందించే అల్పాహారంలో బొద్దింక ప్రత్యక్షమైన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. అయితే చనిపోయిన బొద్దింకను గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వేసినట్లు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఈనెల 20న మాలగాళలో ఉన్న ఇందిరాక్యాంటీన్‌లో ఓ వ్యక్తి అల్పాహారం కోసం ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆహారపదార్థంలో బొద్దింక కనిపించింది. ఈ దృశ్యాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించిన హేమంత్‌కుమార్ అనేవ్యక్తి ఫేస్బుక్లో అప్‌లోడ్‌చేశాడు. స్పందించిన పాలికె అధికారులు ఆ క్యాంటీన్లోని సీసీకెమెరాలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు అల్పాహారంలో ఉద్దేశపూర్వకంగా బొద్దింక వదిలినట్లు గుర్తించారు. హేమంత్‌కుమార్‌తో పాటు అల్పాహారానికి వచ్చిన నలుగురిపై పాలికె అధికారులు కామాక్షీపాళ్య పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కాగా షేప్‌టాక్ అనే సంస్థ ఇందిరా క్యాంటీన్‌కు ఆహారాన్ని సరపరా చేస్తోంది. -
ఇక ఐదుకు టిఫిన్, పదికి భోజనం
సాక్షి, బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెలకొల్పిన అమ్మ క్యాంటీన్లు ఇప్పుడు పలు రాష్ట్రాలకు ఆదర్శం అవుతున్నాయి. పేద ప్రజలకు అవసరమైన ఆహారాన్ని చౌక ధరలకు అందించేందుకు పలు రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు తరహాలో టిఫిన్లు, భోజనాలు సరసమైన ధరలకు సరఫరా చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు స్కీములు నిర్వహిస్తుండగా, తాజాగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చౌక ధరలకు ఆహారాన్ని సరఫరా చేసే క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది. కర్ణాటకలో బుధవారం 101 పేదల క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో కొన్నింటిని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఓ క్యాంటీన్లో సీనియర్ నేతలతో కలసి భోజనం కూడా చేశారు. ఒక్కో క్యాంటీన్ రోజుకు మూడు వందల మంది ఐదు వందల మంది వరకు భోజన వసతిని కల్పిస్తుంది. ఇందిర పేరిట ఏర్పడిన ఈ క్యాంటీన్లలో టిఫిన్‌ను ఐదు రూపాయలకు, భోజనాన్ని పది రూపాయలకు వడ్డిస్తారు. ఎంపిక చేసిన కొన్ని క్యాంటీన్లలో టిఫిన్, భోజనాలు, కూరలు 25 రకాల వరకు ఉంటాయి. ఎక్కువ వాటిలో తక్కువ రకాలే ఉన్నప్పటికీ రోజుకో వెరైటీ ఉండేలా చూస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 27 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కో కిచెన్ చొప్పున ఏర్పాటు చేశారు. ఈ కిచెన్ పలు క్యాంటీన్లకు ఆహారాన్ని సరఫరా చేస్తాయి. బెంగళూరు నగరంలోని ప్రతి వార్డులో ఓ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. టిఫిన్‌కు ఎక్కువగా ఇడ్లీలు, లంచ్‌కు రైస్, సాంబార్ ఎక్కువగా సరఫరా చేస్తారు. ఒక్కో క్యాంటీన్‌ను వేగంగా ఎనిమిది రోజుల్లోనే నిర్మించారు. అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 27 కిచెన్లలో 5 కిచెన్లను స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు ప్రత్యేకంగా కేటాయించారు. ఈ ఇందిర క్యాంటీన్లు మనకు ఎక్కడ దగ్గర ఉన్నాయో తెలియకపోతే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఎక్కడెక్కడ ఉన్నాయో యాప్ తెలియజేయడమే కాకుండా ఈ రోజు మెనూ ఏమిటో కూడా తెలియజేస్తోంది. క్యాంటీన్ రుచులనుబట్టి వినియోగదారులు రేటింగ్‌లు కూడా ఇవ్వొచ్చు. బాగోలేకపోతే యాప్ ద్వారానే ఫిర్యాదులు పంపవచ్చు. -
మెట్రోపాలిటన్ సిటీలో రూ.10కే భోజనం
- బెంగళూరు మహానగరంలో ఇందిర క్యాంటీన్లు - రూ.5కే అల్పాహారం.. ప్రారంభించిన రాహుల్ గాంధీ బెంగళూరు: మెట్రోపాలిటన్ నగరమైన బెంగళూరులో ఇక రూ.10కే భోజనం, రూ.5కు అల్పాహారం లభించనుంది. తక్కువ ధరకే పేదలకు రుచికరమైన భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘ఇందిర క్యాంటీన్’లను కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) బెంగళూరు నగరంలో మొత్తం 101 క్యాంటీన్లను నిర్మించింది. జయనగర్‌లోని కనకనపాల్య వద్ద ఏర్పాటుచేసిన క్యాంటీన్‌ను ప్రారంభించిన రాహుల్ వెంట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు, బెంగళూరు మేయర్ సహా పలువురు నేతలు ఉన్నారు. రిబ్బన్ కట్ చేసిన అనంతరం లోపలికి వెళ్లిన రాహుల్.. క్యాంటిన్లో కలియతిరిగి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం సిద్ధరామయ్య మార్చి నాటి బడ్జెట్ సమావేశాల్లో.. ఆగస్టు 15 నాటికి ఇందిర క్యాంటీన్లను ఏర్పాటుచేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఆ మేరకు బెంగళూరు సిటీలో 198 క్యాంటీన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసిన బీబీఎంపీ.. నిర్ణీత గడువులోగా 101 క్యాంటీన్లను మాత్రమే పూర్తిచేసింది. ఉదయం 7:30 నుంచి రాత్రి 7:30 వరకూ తెరిచి ఉండే ‘ఇందిర క్యాంటీన్’లలో రూ.5కే అల్పాహారం, రూ.10కే భోజనాన్ని అందిస్తారు. గతంలో ఉత్తరాఖండ్‌లోనూ నాటి కాంగ్రెస్ సీఎం హరీశ్ రావత్ ‘ఇందిర భోజనశాల’ పేరుతో ఈ తరహా క్యాంటీన్లను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.