సాక్షి, బెంగళూరు: ఓ యువకుడు బొద్దింక తెచ్చాడు.. ఎవరూ గమనించడం లేదనుకుని క్యాంటీన్‌లోని ఆహార పదార్థాల్లో వదిలాడు.. వంటకాల్లో బొద్దింక ఉంది.. ఇక్కడి ఆహారాన్ని ఎవరూ తినొద్దంటూ కాసేపు హల్‌చల్ చేశాడు.. దానికి తోడు యువకుడితో గొంతు కలిపారు అతని మిత్రులు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు వచ్చి క్యాంటీన్‌లోని సీసీ కెమెరా ఫుటేజిని పరిశీలించారు.. ఆ పని చేసింది సదరు యువకుడు, అతని స్నేహితులు అని రుజువవడంతో కటకటాల వెనక్కి చేరారు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి జరిగింది. హేమంత్, దేవరాజ్ అనే ఇద్దరు ఆటో డ్రైవర్లు మరో ఇద్దరితో కలిసి నగరంలోని కామాక్షిపాల్యలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరా క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు శుక్రవారం వెళ్లారు. చిన్నపాటి గొడవ సృష్టిద్దామనుకుని వడ్డించిన పదార్థంలో బొద్దింక వచ్చిందంటూ హోటల్ సిబ్బందితో బెదిరింపులకు దిగారు.
హోటల్‌కు వచ్చిన కస్టమర్లను అక్కడ భోజనం చేయవద్దంటూ హడావిడి చేశారు. విషయం పోలీసులకు చేరడంతో హోటల్‌కు వచ్చి ఆరా తీశారు. నగర పౌర సేవా సంస్థ బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) సబ్సిడీ ధరలకు ఆహారం అందించేందుకు ఈ క్యాంటీన్లను నిర్వహిస్తోంది. వారిని సంప్రదించగా ఈ గొడవకు సంబంధించిన వీడియో ఫుటేజిని పోలీసులకు అందజేసింది. దాన్ని పరిశీలించగా హేమంత్ బొద్దింకను తీసుకొచ్చి ఆహార పదార్థాల్లో వదిలాడని నిర్ధారణ అయింది. అతనితో వచ్చిన దేవరాజ్‌కు విషయం తెలిసినా అతను కూడా హేమంత్ చర్యలను సమర్థించాడు. దీంతో హేమంత్, దేవరాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పబ్లిసిటీ కోసమే ఇలా చేశామని వారు విచారణలో అంగీకరించారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment