డబ్బు కోసమే...
చిన్నారులను కిడ్నాప్ చేసి చంపేస్తున్న దుండగులు
వరుస ఘటనలతో తల్లిదండ్రుల ఆందోళన
చాంద్రాయణగుట్ట: తల్లిదండ్రులపై ఉన్న కోపం...ఆర్థిక వివాదాలు...అక్రమంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో కొందరు పాతబస్తీలోని చిన్నారులను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేస్తున్నారు. ఆరు నెలల క్రితం జంగమ్మెట్కు చెందిన బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే తాజాగా.. చాంద్రాయణగుట్ట ఇంద్రానగర్‌కు చెందిన బాలుడిని కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేయడంతో పాతబస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమతో పాటే బస్తీల్లో ఉంటున్న మానవ మృగాలు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పాఠశాలకు వెళ్లిన తమ చిన్నారులు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో.. లేదోనని భయపడిపోతున్నారు.
పాతబస్తీలోని ఫలక్‌నుమా డివిజన్ పరిధిలోనే చిన్నారుల కిడ్నాప్, హత్య ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. ఈ డివిజన్లో జరిగిన ముగ్గురు చిన్నారుల హత్యలకు ప్రధాన కారణం డబ్బే. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లే తమ పిల్లల రాకపోకలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనుమానితులెవరైనా పిల్లలతో మాట్లాడుతున్నట్టు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. కిడ్నాప్ జరిగిన సమయంలో పూర్తి వివరాలు తమకు తెలియజేస్తే చిన్నారులను కాపాడేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.
స్కూళ్ల వద్ద కానరాని సీసీ కెమెరాలు...
పాతనగరంలో ఇప్పటి వరకు జరిగిన చిన్నారుల కిడ్నాప్‌లో అధికంగా పాఠశాలల వద్దే జరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలల యజమాన్యాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగైదు పర్యాయాలు చిన్నారుల కిడ్నాప్‌కు విఫలయత్నాలు జరిగాయి. అయినా పాఠశాలల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయలేదు. పోలీసులు పట్టించుకోకపోవడమే దీనికి కారణం.
గతంలో జరిగిన కొన్ని ఘటనలు
చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో గతనెల 22న ప్రభాకర్, ఉమారాణిల కుమారుడు కరుణాకర్(10)ను అదే ప్రాంతానికి చెందిన మల్లికార్జున్, మోహన్‌లు కిడ్నాప్ చేసి అదేరోజు దారుణంగా హత్య చేశారు. డబ్బు కోసం వీరు పది రోజుల పాటు చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వేధించారు.
ఛత్రినాక ఠాణా పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ 5న జంగమ్మెట్ ఎంసీహెచ్ క్వార్టర్స్ ప్రాంతంలోని ఇంటి ముందు ఆడుకుంటున్న రాజు, సుజాత దంపతుల కుమారుడు మాస్టర్ డి.కార్తీక్ (10)ను బంధువు శివకుమర్ (22) కిడ్నాప్ చేసి రూ. 2 లక్షలు డిమాండ్ చేశాడు. తల్లిదండ్రుల నుంచి సమాధానం వచ్చేంత లోపే బాలుడిని షాద్‌నగర్‌లో చంపేశాడు.
గతేడాది నవంబర్‌లో పాతబస్తీ రికాబ్గంజ్కు చెందిన బంగారు వ్యాపారి గోపాల్ మాజీ కుమారుడు ఆకాష్ ( రెండున్నరేళ్లు)ను దుకాణంలో పనిచేసే దూరపు బంధువు రాంప్రసాద్ (26) కిడ్నాప్ చేశాడు. మూడు కిలోల బంగారం కావాలంటూ పది రోజుల పాటు డిమాండ్ చేశాడు. కాని ఈ ఘటనలో మాత్రం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాలుడిని రక్షించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో 2010 డిసెంబర్లో చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదన్న కక్షతో సదరు ఏజెంట్ కుమారుడిని దుండగులు కిడ్నాప్ చేసి బీచ్పల్లిలో కృష్ణానది వద్ద చంపేశారు.