'రాహుల్ బావను వదిలేది లేదు'
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణాలను వదిలేది లేదని, వాటిపై విచారణ జరిపి తీరుతామని హర్యానా ప్రభుత్వం స్పష్టం చేసింది. ''రాహుల్ గాంధీ గారి సూటు-బూటు బావను వదలబోము.. ఆయనపై దర్యాప్తు తప్పదు'' అని ఆ రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ చెప్పారు. ఆయన చేసిన తప్పులకు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని ఆయన అన్నారు.
గతంలో హర్యానాలో అధికారంలో ఉన్న భూపీందర్ సింగ్ హూడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాబర్ట్ వాద్రాకు అనుచిత లబ్ధి చేకూర్చిందని కాగ్ తప్పుబట్టింది. రియాల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్తో కలిసి వాద్రా కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు చెప్పింది. గుర్గావ్ జిల్లాలోని అత్యంత ఖరీదైన మనేసర్ ప్రాంతంలో 3.5 ఎకరాల భూమిని హూడా సర్కారు నుంచి అత్యంత చవగ్గా.. కేవలం 15 కోట్లకే వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీ పొందింది. తర్వాత దాన్ని రూ. 58 కోట్లకు డీఎల్ఎఫ్కు అమ్మింది.