ఓ డాక్టర్.. వంద మంది పిల్లలు..
♦ వంద మంది పిల్లలను కంటానంటున్న పాక్ వైద్యుడు
♦ ఇప్పటికే ముగ్గురు భార్యల ద్వారా 35 మంది పిల్లలు
కరాచీ: ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే వారిని చూసుకునేందుకు చాలామంది నానా తంటాలు పడుతుంటారు.. అలాంటిది అతనికి ఏకంగా 35 మంది పిల్లలు ఉన్నారు. అతను అక్కడితో ఆగడం లేదు. తన కుటుంబాన్ని విస్తరించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకు ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నాడు.. అదేంటో తెలుసా.. వంద మంది పిల్లల్నికని రికార్డు సృష్టించాలనేది మనోడి లక్ష్యం. పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతం బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నగరానికి చెందిన వైద్యుడు జాన్ ముహమద్(43). ఇతనికి ముగ్గురు భార్యలు. 35 మంది సంతానం. 21 మంది కుమార్తెలు కాగా.. 14 మంది కుమారులు. గత వారం ఇతని రెండు.. మూడో భార్యలు ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. దీంతో తాను 35 మంది పిల్లలకు తండ్రినయ్యానంటూ తెగ సంబరపడిపోతున్నాడు ముహమద్.
అంతటితో ఊరుకోలేదు. కుదరితే నాలుగో వివాహం చేసుకుంటానని, తనకు వంద మంది పిల్లలు కావాలని చెపుతున్నాడు. పెద్ద కుటుంబమైనా వారందరికీ తిండి పెట్టడానికి తనకు ఎటువంటి ఇబ్బందీ లేదంటున్నాడు. కుటుంబాన్ని పోషించేందుకు నెలకు రూ. లక్ష ఖర్చవుతోందని, తాను క్వాలిఫైడ్ డాక్టర్ కావడం.. చిన్న వ్యాపారం కూడా చేస్తుండటం వల్ల ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం లేదంటున్నాడు. చదువు లేకపోతే ప్రస్తుతం జీవితం లేదని, అందుకే తన పిల్లలకు ఉన్నత విద్య చెప్పిస్తానని చెపుతున్నాడు. ముహమద్ కుటుంబం గురించి ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన డాన్ టీవీ ఒక కార్యక్రమం ప్రసారం చేసింది.