చేతులు కలిపిన వైద్యులు, శాస్త్రవేత్తలు
చౌకైన చికిత్స లక్ష్యంగా ఉస్మానియా, ఐఐసీటీల భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: రోగులకు చౌకైన, మెరుగైన చికిత్సలే లక్ష్యంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) తెలంగాణ వైద్యవిద్య శాఖలు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమణి తెలిపారు. వైద్యులు, శాస్త్రవేత్తలు కలసికట్టుగా కృషి చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. జన్యుపరమైన తేడాలతో భారతీయులు చిన్న వయసులోనే మధుమేహం, గుండెజబ్బులు, కేన్సర్ల బారిన పడుతున్నారని, దీనిపై పరిశోధించేందుకు, తదనుగుణంగా చికిత్స పద్ధతులను మార్చుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని వివరించారు. ఐఐసీటీ బుధవారం మెడ్సైన్స్ 2015 పేరుతో ఏర్పాటు చేసిన సదస్సులో ఐఐసీటీ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, ఉస్మానియా వైద్యకళాశాల పరిధిలోని 10 ఆసుపత్రుల ఉన్నతాధికారులు, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు.