'నాయకులకు విద్యార్థులు చేయూతనివ్వాలి'
విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న యువభేరిలో ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగం సాగిందిలా...
'ఉత్తరాంధ్ర విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వాలు బొబ్బిలి, శ్రీకాకుళం, పైడిభీమవరం, పరవాడలను పెట్రోకెమికల్ జోన్ అని చెప్పారు. కానీ ఇక్కడ తిరిగి చూస్తే ఎక్కువగా పరిశ్రమలు రాలేదు. పరిశ్రమ పెట్టిన మొదటి మూడునాలుగేళ్లు నష్టాలే తప్ప లాభాలు రావు. అదే ప్రత్యేక హోదా ఉంటే మొదట్లో రాయితీలు వస్తాయి కాబట్టి పరిశ్రమలు నెలకొల్పుతారు, ఉత్తరాంధ్ర విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది.
చదువు అయిపోయిన తర్వాత ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివాను కదా, ఏదైనా పరిశ్రమ పెడతానని అడిగితే.. లాభదాయకమైన పరిశ్రమ ఇదీ అని చెప్పలేకపోతున్నాం. కెమికల్, ఫార్మా పరిశ్రమలు అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. అక్కడివాళ్లకే ఉద్యోగాలు వస్తున్నాయి తప్ప ఇక్కడివాళ్లకు రావడం లేదు. ప్రత్యేక హోదా వస్తే.. ఇక్కడే పరిశ్రమలు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనికోసం పోరాడుతున్న నాయకులకు విద్యార్థులు చేయూతనివ్వాలి' అన్నారు.