ఛాతీలో గుచ్చినట్లుగా నొప్పి..!
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 32 ఏళ్లు. నాకీమధ్య తరచూ చెమటలు పోస్తూ, గుండెదడ వస్తోంది. ఇంతేగాక... ఛాతీలో గుచ్చినట్లుగా కూడా అనిపిస్తోంది. ఇలా ఎక్కువగా ఖాళీసమయాల్లో కూర్చొని ఉన్నప్పుడు అవుతోంది. ఆఫీసులో పని అంతా మామూలుగానే చేసుకోగలుగుతున్నాను. నా సమస్య ఏమిటో తెలియక ఆందోళనపడుతున్నాను. దయచేసి నేనేం చేయాలో చెప్పండి.
- వినోద్, హైదరాబాద్
మీరు వివరించిన అంశాలను బట్టి మీకు గుండెజబ్బు ఉండే అవకాశం చాలా తక్కువ అనిపిస్తోంది. ఏదైనా గుండెజబ్బు ఉన్నప్పుడు అది తొలిదశలో ఉన్నా కూడా నడిచినప్పుడూ, పనిచేసినప్పుడూ నొప్పి వస్తుంది. కానీ మీరు ఆఫీసులో బాగానే ఉండి, ఇంట్లో ఖాళీ సమయంలోనే నొప్పినీ, దడను ఫీలవుతున్నారు. కాబట్టి ఇది కేవలం యాంగ్జైటీ వల్ల వచ్చిన సమస్యలా అనిపిస్తోంది. మరో విషయం ఏమిటంటే గుండెనొప్పి ఎప్పుడూ ఒకచోట గుచ్చినట్లుగా రాదు. కాబట్టి మీరు భయాన్ని వీడి... యోగా, వాకింగ్ లాంటివి చేస్తూ, మంచి ఆహారనియమాలనూ, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించి, నిర్భయంగా ఉండండి.
నా వయసు 45. ఇటీవలే గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత చాలా బెంగగా ఉంది. ఇంక నేను ఏ పనీ చేసుకోలేను, గనక జీవనాన్ని ఎలా గడపాలా అని ఆందోళన పడుతున్నాను. దయచేసి నా బాధను అర్థం చేసుకొని నాకు తగిన సూచనలు ఇవ్వండి.
- సూర్యప్రకాశ్, విజయవాడ
గుండెపోటు వచ్చినంత మాత్రాన ఇక జీవనోపాధి కోసం ఏమీ చేయకుండా, పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండాలన్న అభిప్రాయం పొరబాటు. గుండెపోటు వచ్చినా మొదటి గంటలోనే చికిత్స తీసుకున్నట్లయితే గుండెకు పెద్దగా హాని జరగదు. కాబట్టి డాక్టర్లు సూచించిన మందులు వాడుకుంటూ జీవితాన్ని మునుపటిలాగే గడపవచ్చు. మీరు రాసిన లేఖలో మీకు ఏవిధమైన చికిత్స చేశారు, గుండెపోటు వచ్చిన ఎంత సేపట్లో చికిత్స అందింది అన్న వివరాలు లేవు. ఇప్పుడు మీ గుండె పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోడానికి ‘2డీ ఎకో’ పరీక్ష చేయించి, గుండె పంపింగ్ తీరు నార్మల్‌గా ఉంటే, టీఎమ్‌టీ పరీక్ష చేయించుకోండి.
మీరు ఎంత పని చేయగలరో నిర్ధారణ చేయగలిగే పరీక్ష ఇది. వాటి ఫలితాలను బట్టి మీరు చేసుకోగల పనులను డాక్టర్లు సూచిస్తారు. కాబట్టి మీరు నిరుత్సాహపడకుండా మీ గుండె చికిత్స నిపుణులను కలిసి, తగిన పరీక్షలు చేయించుకొని, ఇంతకుముందులాగే జీవితాన్ని హాయిగా గడపండి. అయితే గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే... గుండెపోటు మళ్లీ రాకుండా ఉండేందుకు డాక్టర్ ఇచ్చిన మాత్రలు సక్రమంగా వాడుతూ ఉండాలి. మీరు యోగా, వాకింగ్ వంటి వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ఎంతైనా అవసరం.
డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్
చీఫ్ కార్డియాలజిస్ట్,
సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్