అమ్మో.. సెలైన్..!
సుల్తాన్‌బజార్
సరోజినీదేవి కంటి ఆస్పత్రి ఘటనతో నగరంలోని సర్కారు దవాఖానల్లోకి వెళ్లేందుకు జనం జంకుతున్నారు. నాసిరకం సెలైన్ బాటిల్స్ వల్ల పలువురికి చూపుపోయిన వార్తతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సెలైన్ అవసరమున్న రోగులు బెంబేలెత్తుతున్నారు. సెలైన్ కావాల్సి వస్తే తాము బయటి నుండి తెచ్చుకుంటామని పలువురు రోగులు, వారి బంధువులు వైద్యులకు మొరపెట్టుకుంటున్నారు.
సరోజినీదేవి కంటి ఆస్పత్రికి సెలైన్ బాటిళ్లు సరఫరా చేసే హసీబ్ ఫార్మా స్యూటికల్స్ కంపెనీయే సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలోనూ రింగర్స్ లాక్టెట్(ఆర్ఎల్) సెలైన్ బాటిళ్లను సరఫరా చేస్తోంది. ఏప్రిల్ నెలలో ఈ ఆస్పత్రికి 29వేల సెలైన్ బాటిళ్లు సరఫరా అయ్యాయి. ప్రస్తుతం ఆ కంపెనీకి చెందిన 13, 500 బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే కంపెనీకి చెందిన బాటిళ్లను అధికారులు గురువారం నిలోఫర్ ఆస్పత్రిలో సీజ్ చేసిన విషయం విదితమే.
ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న హసీబ్ కంపెనీకి చెందిన 13, 500 బాటిళ్ల సెలైన్ స్టాక్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారుల ఆదేశాలతో బ్లాక్ చేసినట్లు ఆర్ఎంవో డాక్టర్ విద్యావతి తెలిపారు. ప్రస్తుతం ఇన్వేర్ ఫార్మాసిటికల్ కంపెనీకి చెందిన సెలైన్లను రోగులకు అందుబాటులో ఉంచామన్నారు.