ఎన్ఎంసీ బిల్లు.. వైద్యవిద్యకు చిల్లు
వైద్య విద్యకు తూట్లు పొడిచే ఎన్ఎంసీ బిల్లును రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు పోరు బాటు పట్టారు. ఈ బిల్లు వల్ల ప్రతిభతో సంబంధం లేకుండా డబ్బు ఉన్నవారే వైద్యులు అవుతారని మండిపడ్డారు. వేటు కళాశాలలకు వరంగా ఉన్న ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సాక్షి, పాతపోస్టాఫీసు(విశాఖ ) : ఎన్నో అభ్యంతరాలు ఉన్నా పార్లమెంట్ పొందిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) బిల్లుతో వైద్య విద్యకు తూట్లు పడతాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంనే) విశాఖ శాఖ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పి.ఎ.రమణి అన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధత కల్పించిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఐఎంఏ ఆధ్వర్యంలో బుధవారం కేజీహెచ్ వైద్యులు, వైద్య విద్యార్థులు ఆస్పత్రి ఆవరణలో నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి డీఆర్వో శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర వైద్య శాఖ మంత్రికి పంపారు.
ఈ సందర్భంగా డాక్టర్ రమణి మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నూతనంగా ప్రవేశపెడుతున్న నేషన్ మెడికల్ కమిషన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఎన్ఎంసీలో నియమించనున్న 25 మంది సభ్యుల్లో వైద్య పరిజ్ఞానం లేనివారే అధికంగా ఉన్నారని చెప్పారు. దీని ద్వారా వైద్య వైద్య విద్యను కొనుక్కునే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ బిల్లు వద్దని అనేక వినతులు అందజేసినా అవన్నీ తొక్కిపట్టి కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించడం ద్వారా వైద్య విద్యను నిర్వీర్యం చేస్తుందని అన్నారు.
వైద్య విద్య ప్రైవేటు పరం
జాతీయ మెడికల్ కౌన్సిల్ అవినీతి రహితంగా పనిచేస్తుందని, దీన్ని రద్దు చేసి ఎన్ఎంసీ బిల్లు ఆమోదించడం అన్యాయమన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని, ఈ బిల్లు వల్ల వారు వైద్య విద్య అభ్యసించే అవకాశం కోల్పోతారన్నారు. ఇప్పటి వరకు 85 శాతం రిజర్వేషన్లు ఉండగా ఈ బిల్లుతో ప్రైవేటు కళాశాలలకు 50 శాతం యాజమాన్య కోటాలకు పోతాయన్నారు.
ఎగ్జిట్ పరీక్షపై స్పష్టత లేదు
ఎన్ఎంసీ ద్వారా నిర్వహించనున్న ఎగ్జిట్ పరీక్ష విధానంలో స్పష్టత లేదని, ఎంబీబీస్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి భవిష్యత్తును ఎగ్జిట్ పరీక్ష నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే తప్ప తాను చదివిన వైద్య విద్యను సార్థకం చేసుకోలేడని ఏపీ జూనియర్ వైద్యుల సంఘం అ«ధ్యక్షుడు డాక్టర్ దీప్‌చంద్ అన్నారు.ఆ పరీక్ష ఫెయిల్ అయితే ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థి ఇంటర్మీడియట్ విద్యార్థితో సమానంగా ఉంటాడని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్ వైద్యులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయినా కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లు పేరిట ఆర్ఎంపీ వైద్యులకు ఆరు నెలల బ్రిడ్జి కోర్సును నిర్వహించి వారిని గ్రామీణ ప్రాంతాల్లో నియమించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నంలో న్యాయం లేదన్నారు.
ముందుగా నోటీసు ఇవ్వలేదు
కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కేజీహెచ్‌లోని వైద్యులు, జూనియర్ వైద్యులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిరసన చేపట్టడం సమంజసం కాదని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి. అర్జున పేర్కొన్నారు. రాత్రి నోటీసు మరుసటి రోజు విధులకు హాజరుకామని చెప్పడం తగదని. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా వారే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఓపీ సేవలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుందని ఐఎంఏ, జూనియర్ వైద్యులు చెబుతున్నా, వైద్య విద్యా సంచాలకులకు దీనిపై ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
నేటి నుంచి సమ్మెలోకి జూడాలు
1 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు ఏపీ జూనియర్ వైద్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జునకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ జూనియర్ వైద్యుల అసోసియేషన్ విశాఖ శాఖ అధ్యక్షుడు డాక్టర్ దీప్‌చంద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన నిరసన తెలియజేసేందుకు రాష్ట్ర నాయకులతో చర్చి స్తున్నామని, దిశా నిర్దేశం జరిగిన తర్వాత రేపటి నుంచి కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేపట్టిన నిరసనకు తమ మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు.
ఎన్ఎంసీ బిల్లు లోప భూయిష్టం
జాతీయ మెడికల్ కౌన్సిల్ బిల్లు లోపభూయిష్టంగా ఉన్నా కేంద్రం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించింది. అయితే బిల్లు ప్రవేశ పెట్టడానికి ముందు ఒక కమిటీని వేయాల్సి ఉంది. ఈ కమిటీ ఐఎంఏ, వైద్య విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయం సేకరించి బిల్లును పూర్తి స్థాయిలో రూపొందించి ఉంటే దేశ వ్యాప్తంగా ఆందోళన జరగకుండా ఉండేది కాదు.
– డాక్టర్ జి.అర్జున, కేజీహెచ్ సూపరింటెండెంట్