ప్రభుత్వ వైద్యులపై మంత్రి మండిపాటు
ఒక్కళ్లూ సమయానికి రారు.. మీ కోసం రోగులు ఎంతసేపు వేచిచూడాలి.. ఇదేనా మీరు చేసే పని అంటూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రి వైద్యులపై మండిపడ్డారు. ఆస్పత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయన వచ్చిన సమయానికి ఏ ఒక్క వైద్యుడూ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆస్పత్రిలో జరుగుతున్న లంచాల తంతును... ఓ రోగి బంధువులు మంత్రికి వివరించారు. పచ్చనోటు పెట్టనిదే సిబ్బంది పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. లంచం పేరుతో పీక్కు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల ఫిర్యాదులు విన్న మంత్రి దీనిపై వెంటనే ప్రత్యేక విచారణ జరిపించి, బాధ్యులపైకఠిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఆస్పత్రి మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామన్నారు.