ఇంట్లోకెళ్తే చంపేస్తామంటున్నారు!
– ఇంటి చుట్టూ రాళ్లు అడ్డుపెట్టిన ప్రత్యర్థులు
– ఆపై మారణాయుధాలతో బెదిరింపులు
ఆత్మకూరు : ఆత్మకూరు మండలం దొడ్డే కొట్టాల గ్రామంలో రెండు కుటుంబాల మధ్య దాయాది పోరు రగులుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. భూ వివాదమే దీనికంతటికీ కారణమైంది. రెండ్రోజుల నుంచి తమను ఇంట్లోకి వెళ్లనీయకుండా ప్రత్యర్థులు అడుగడుగునా అడ్డుపడుతున్నారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఇంట్లోకి వెళ్లకుండా చుట్టూ రాళ్లు అడ్డుపెట్టి, ఆపై మారణాయుధాలతో బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం...
అసలు కథలోకి వెళ్తే...
గ్రామంలో కృష్ణా అనే వ్యక్తి తమ తాత ముత్తాతల నుంచి సంక్రమించిన 13.80 ఎకరాలను అనుభవిస్తున్నాడు. ఇటీవల కృష్ణా పెదనాన్న కుమారులైన రాజశేఖర్, ఎర్రన్న, సాయినాథ్, శ్రీనివాసులు, రవికుమార్ అనే వ్యక్తులు బెదిరించి బలవంతంగా ఏడెకరాలను తమ పేరిట రాయించుకున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే శుక్రవారం సాయంత్రం తన పొలంలోకి ప్రత్యర్థుల గొర్రెల మంద రావడాన్ని కృష్ణా ప్రశ్నించారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు అదే రాత్రి.. మీరు ఇంట్లోకి ఎలా వస్తారో చూస్తామంటూ బెదిరించారు. ఇంట్లోకి వెళ్లకుండా చుట్టూ రాళ్లు అడ్డుపెట్టారు. ఆపై ఐదుగురు మారణాయుధాలతో తిరుగుతూ తమను భయభ్రాంతులకు గురి చేశారని కృష్ణా కుటుంబ సభ్యులు తెలిపారు. రెండ్రోజులుగా ఇంట్లోకి వెళ్లలేక, బయటే ఉంటున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. మిగిలిన పొలంతో పాటు ఇళ్లను సైతం తమకు రాసిచ్చేయాలని హుకుం జారీ చేశారని తెలిపారు. మర్రెమ్మ అనే వృద్ధ అంధురాలిపై సైతం కనికరం లేకుండా ఇంట్లోకి రానీయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
పోలీసులు చెప్పినా...
ప్రత్యర్థుల దుర్మార్గంపై తాము ఆత్మకూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని కృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. వారొచ్చి చెప్పినా తమ ప్రత్యర్థులు వినలేదని తెలిపారు. చివరకు తామే ప్రాణాలకు తెగించి రాళ్లను తొలగించామన్నారు.
మంత్రి అండ చూసుకునే...
తమ ప్రత్యర్థులు ఇంతగా బరితెగించడానికి కారణంగా జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలు చూసుకునేనని కృష్ణ కుటుంబ ఆరోపించింది. పొలం, ఇళ్ల విషయమై సదరు మంత్రి ఇంటి వద్ద పంచాయితీ సైతం జరిగిందని తెలుస్తోంది.