డీసీసీ అధ్యక్షుడిగా డోల జగన్?
నేడు ప్రకటించే అవకాశం
రాష్ట్ర నాయకుల పిలుపుతో రాజధాని పయనం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న డోల జగన్‌కు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శనివారం హైదరాబాద్‌లో ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర నేతలు జగన్‌ను తక్షణం హైదరాబాద్ రావాలని కోరడంతో శుక్రవారం సాయంత్రం బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షునిగా ఉన్న నర్తు నరేంద్రయాదవ్ త్వరలో పార్టీని వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడంతో అంతకు ముందే ఆయన్ని తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించి జగన్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. అయితే డోల ఎంపికపై ఆ పార్టీలోని కొందరు నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పీఆర్పీలో చేరి ఓటమి చవిచూసిన తరువాత కాంగ్రెస్‌లోకి వచ్చిన జగన్‌కు ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ పదవిని కట్టిపెట్టారని, దీనికి అదనంగా డీసీసీ పీఠాన్ని కూడా ఆయనకే ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పార్టీలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఎందరో సీనియర్లు ఉండగా వారిని కాదని.. జోడు పదవులను పార్టీ ఫిరాయింపుదారునిగా ఉన్న జగన్‌కు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. జగన్ పేరును ప్రకటించిన వెంటనే సమావేశమై భవిష్యత్‌ను నిర్ణయించుకోవాలని వారు భావిస్తున్నారు.