పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా డోలే బర్మన్
⇒ మళ్లీ మహిళా అధికారినే నియమించిన కేంద్రం
⇒ నేడు బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ కొత్త డైరెక్టర్‌గా మళ్లీ మహిళా అధికారినే నియమిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అరుణాబహుగుణ మంగళవారం పదవీ విరమణ పొందటంతో.. ఆ స్థానంలో 1986 జమ్మూకశ్మీర్ క్యాడర్ ఐపీఎస్ అధికారి డీఆర్ డోలేబర్మన్ను నియమించింది. ప్రస్తుతం మేఘాలయ రిబోయి జిల్లాలోని ఉమియాం నార్త్ ఈస్టర్న్ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బర్మన్.. బుధవారం ఎన్పీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎన్నో అవార్డులు... రివార్డులు...
షిల్లాంగ్‌లో పుట్టిన డోలే బర్మన్ ఢిల్లీ యూనివర్సిటీలో లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ఆనర్స్ చేశారు. అదే కాలేజీ నుంచి పీజీ పూర్తిచేసిన బర్మన్ 1986 జమ్మూకశ్మీర్ క్యాడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. జమ్మూకశ్మీర్‌లో ఎస్డీపీవోగా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత కశ్మీర్లో ట్రాఫిక్ ఎస్పీగా, అస్సాంలో ట్రైనింగ్ అండ్ ఆర్మ్డ్ పోలీసు ఏఐజీగా, ఎస్పీ (సెక్యూరిటీ)గా, జమ్మూకశ్మీర్‌లో ట్రాఫిక్ డీఐజీగా, ఢిల్లీ సీబీఐలో అవినీతి నిరోధక విభాగానికి డీఐజీగా, గౌహతి ఎస్ఎస్బీ ఐజీగా, జమ్మూకశ్మీర్ సీఐడీ (ఇంటెలిజెన్స్) ఐజీపీగా పనిచేశారు. ఆమె సేవలకు జమ్మూకశ్మీర్ డీజీపీ అవార్డులు, 2008లో గౌహతిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సమాచారం ముందుగానే గుర్తించినందుకు ఎస్ఎస్బీ డీజీపీ అవార్డు, షేర్–ఈ–కశ్మీర్ పతకం, ఇండియన్ పోలీసు మెడల్, ప్రెసిడెంట్ మెడల్‌ను అందుకున్నారు.