కృష్ణమ్మకు టీటీడీ సారె
మహానంది: ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాల సందర్భంగా కష్ణమ్మకు టీటీడీ నుంచి పట్టుచీర, పసుపు, కుంకుమతో పాటు సకల సౌభాగ్య ద్రవ్యాలను తీసుకుని వెళ్తున్నట్లు తిరుమలకు చెందిన డాలర్ శేషాద్రి తెలిపారు. కష్ణా పుష్కరాల సందర్భంగా తిరుమల నుంచి బుధవారం బయలుదేరిన శ్రీవారి కల్యాణ రథం గురువారం మహానందికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మహానంది దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఆలయ వేదపండితులు రవిశంకర అవధాని.. తదితరులు వారికి స్వాగతం పలికారు. అనంతరం డాలర్ శేషాద్రి మాట్లాడుతూ.. తిరుచానూరు, అహోబిలం, మహానంది, శ్రీశైలం, మంగళగిరి, అమరావతి, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ దేవాలయాల నుంచి పసుపు కుంకుమలు తీసుకుని వెళ్తామన్నారు. అనంతరం పుష్కరాల ప్రారంభం రోజున ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు కష్ణానదిలో వీటిని సమర్పిస్తారన్నారు. ఒంటిమిట్ట మీదుగా ఇక్కడికి వచ్చామని.. 7వ తేదీకి విజయవాడకు చేరతామన్నారు. విజయవాడలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నమూనా ఏర్పాటు చేశామన్నారు. ఏఈఓ రాజశేఖర్, ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.