domapotu
-
వరికి దోమపోటు
- సింతటిక్ పైరిథ్రాయిడ్స్తో మరింత ఉద్ధృతం - నివారణకు డాట్ సెంటర్ శాస్త్రవేత్త సూచనలు కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 67,985 హెక్టార్లలో వరి సాగైంది. ప్రస్తుతం పంట చిరు పొట్ట దశలో ఉంది. ఈ దశలో సుడిదోమ ఆశించే ప్రమాదం అధికం. దీన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే పంటను రక్షించుకోవచ్చు. వరినాశించే పురుగులో ఎక్కువ నష్టాన్ని కలుగజేసేది సుడి దోమ. దీనినే దోమ పోటు అని కూడా అంటారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని వరి పండించే అన్ని ప్రాంతాల్లో దీని తాకిడి పెరుగుతోంది. వరిని ముఖ్యంగా రెండు రకాల దోమలు ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. అవి తెల్ల వీపు దోమ, రబీలో గోధుమ రంగు దోమ వరిని ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయని కర్నూలు ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్, శాస్త్రవేత్త సుజాతమ్మ(ఫోన్: 9989623810) తెలిపారు. నివారణ విధానాలను కూడా తెలియజేశారు. తెల్ల వీపు మచ్చ దోమ... ఇవి గోధుమ రంగు దోమ కంటే చిన్నవిగా ఉంటాయి. తెల్ల పురుగుల ముందు రెక్కలు కలిసేచోట చివర నల్లటి మచ్చ ఉంటుంది. రెక్కల ముందు భాగంలో తెల్లటి మచ్చ ఉంటుంది. ఇవి 6–8 గుడ్లను వరి దుబ్బుల మొదళ్ల దగ్గర ఆకు తొడిమ లోపల కణజాలంలో పెడతాయి. ఈ గుడ్లు విడివిడిగా ఉంటాయి. పిల్ల పురుగులు తెల్లగా ఉండి 8–28 రోజుల్లో పెద్ద పురుగులుగా మారతాయి. గోధుమ రంగు దోమ... పెద్ద పురుగులు లేత గోధుమ నుంచి ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఆడ దోమలు మగవాటి కంటే పెద్దవిగా ఉంటాయి. సుడి దోమల్లో రెక్కలున్నవి, లేనివి ఉంటాయి. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు, పండు పక్వదశకు వచ్చినప్పుడు రెక్కలున్న దోమలు అభివృద్ధి చెందుతాయి. తల్లి దోమ 300–500 గుడ్లను ఆకు తొడిమ లోపలి కణజాలంలో గానీ, మధ్య ఈనెలో గాని పెడుతుంది. 2 నుంచి 12గుడ్లను ఒకదాని పక్కన ఒకటి పెట్టి వాటి చివరలను ఒక దానితో ఒకటి కలిపి గుంపుగా చేస్తుంది. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఐదుసార్లు కబుసాన్ని విసర్జించి తర్వాత 15–20 రోజుల్లో తల్లి పురుగు దశకు చేరతాయి. నష్టపరిచే విధానం... ముందుగా రెక్కలున్న సుడి దోమలు పిలకలు వేసే దశలో వరిపైరును ఆశిస్తాయి. ఇవి మూడు, నాలుగు వారాల్లో రెక్కలు లేని దోమల్ని (మొదటి సంతతి) ఉత్పత్తి చేస్తాయి. ఆ తర్వాత ఇవి రెండో సంతతిని ఉత్పత్తి చేస్తాయి. ఈ దశలో పిల్ల, తల్లి పురుగులు పైరును తీవ్రంగా నష్టపరుస్తాయి. మనం ఈ దశలో మాత్రమే పురుగుల్ని గుర్తించగలుగుతాము. ఈ సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే రెక్కలున్న మూడో, నాలుగో తరం పురుగులు వృద్ధి చెంది పైరును నష్టపరుస్తాయి. ఈ సుడిదోమలు వరి దుబ్బుల మొదళ్లను ఆశించి రసాన్ని పీలుస్తాయి. దీంతో మొక్కలు గిడసబారి, పోషకాలు అందక పసుపు రంగుకు మారి సుడులు సుడులుగా ఎండిపోతాయి. గోధుమ రంగు దోమల వల్ల ఏర్పడే సుడులు ప్రస్పుటంగా కనిపిస్తాయి. తెల్ల మచ్చ దోమ నష్టం పొలం అంతా విస్తరించి ఉంటుంది. వీటి ఉధృతి అధికంగా ఉన్నప్పుడు వరి కంకి వరకు కూడా ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. తెల్ల మచ్చ దోమ ముఖ్యంగా వరి పిలకలు వేసే తొలి దశలో ఆశిస్తే, గోధుమ రంగు దోమ వరి పొట్ట దశ నుంచి ఆశిస్తుంది. సుడి దోమలు గ్రాసీస్టంట్ వంటి వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. సుడి దోమలు రసం పీల్చినప్పుడు విడుదల చేసే లాలాజలం పోషక కణజాలంతో ఘనీభవిస్తుంది. దీని వలన వేరు వ్యవస్థ నుంచి పోషక పదార్థాలు అందక మొక్కలు ఎండిపోతాయి. సుడిదోమలు ఆకులపై విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థం వలన మసి తెగులు సోకుతుంది. దీంతో కిరణజన్య సంయోగ క్రియ పూర్తిస్థాయిలో జరగక దిగుబడులు తగ్గుతాయి. గింజ గట్టిపడే దశలో దోమలు ఆశించినట్లయితే గింజలు పూర్తిస్థాయిలో పాలు పోసుకోవు. ధాన్యాన్ని మిల్లులో పట్టించినప్పుడు ఎక్కువగా నూకలవుతాయి. సుడి దోమ ఉధృతికి కారణాలు... – సిఫారసు చేయని మందులను విచక్షణా రహితంగా పిచికారి చేయడం. నత్రజని ఎరువును అధికంగా వేయడం. అధికంగా నీటిని పెట్టి ఉంచడం. అవసరం లేకున్నా రెండు మూడు రకాల మందుల్ని కలిపి పిచికారి చేయడం. – సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల్ని వాడటం. సస్యరక్షణ పద్ధతులు... –ప్రధాన పొలంలో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల ఎడంతో కాలిబాటలు తీయాలి. నత్రజని ఎరువును సిఫారసు చేసిన మోతాదులో విడతలవారీగా వేయడం. – దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడప్పుడూ పొలాన్ని ఆరగట్టాలి. సాలీడ్లు, మిరిడ్ నల్లి వంటి మిత్ర పురుగుల్ని సంరక్షించుకోవాలి. – దుబ్బుకి 10–15 దోమలు కనిపించినప్పుడు లీటరు నీటికి 2.2 మి.లీ. మోనోక్రోటోపాస్/ రెండు మిల్లీ లీటర్ల ఇథోపెన్ ఫ్రార్స్/ 1.5 గ్రాముల ఎసిఫేట్/ 1.6 మిల్లీలీటర్ల బుప్రొఫెజిన్/ ఇమిడాక్రోఫిడ్+ఎథసోల్ కలిపిన మందును లీటరు వీటికి 0.25 గ్రాముల చొప్పున కలిపిన 200 లీటర్ల మందు ద్రావణాన్ని ఎకరా పొలంలో పిచికారీ చేసి దోమను నిర్మూలించుకోవచ్చు. డైనోటెప్యురాన్ 0.4 గ్రా./ పైమెట్రోజైన్ 0.6 గ్రా. లీటరు నీటికి కలిపిన మందు ద్రావణాన్ని 200 లీటర్లు ఎకరా పొలంలో పిచికారి చేసి కూడా దోమను నిర్మూలించుకోవచ్చును. – సింథటిక్ ఫైరిథ్రాయిడ్ మందులను వాడరాదు. ఇందువల్ల దోమ ఎక్కువ అవుతుంది. అందువల్ల అత్యవసరమైతే తప్ప వీటిని వాడరాదు. -
విరుగుడు లేదు విషమే!
– వరిపై సింథటిక్ పైరిత్రాయిడ్ విచ్చలవిడి వినియోగం – దోమపోటు నివారణ మందుల పేరుతో అమ్మకాలు – జిల్లాలో రూ.200 కోట్లకుపైగా వ్యాపారం – అక్రమార్కులతో అంటగాగుతున్న అధికారులు కర్నూలు(అగ్రికల్చర్): వరిలో దోమ పోటు నివారణ పేరుతో నకిలీ మందులు, బయోలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నా వ్యవసాయశాఖకు ఎంతమాత్రం పట్టడం లేదు. నిషేధిత సింతటిక్ పైరిత్రాయిడ్‌తో విషపూరిత రసాయనాలు మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నా నియంత్రణ చర్యలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నియంత్రణకు చర్యలు తీసుకోకపోగా ఉన్నతాధికారుల తనిఖీల విషయాలను సైతం ముందుగానే తెలియజేసి జాగ్రత్త పడేలా చూస్తుండడం మరింత విస్తుగొలుపుతున్న అంశం. ఇటీవలే అంతర్ జిల్లా వ్యవసాయాధికారుల బందం జిల్లా పర్యటన విషయాన్ని ఓ వ్యవసాయాధికారి ముందుగానే డీలర్లకు తెలియజేసి అలర్ట్ అయ్యేలా చూసినట్లు ఆరోపణలున్నాయి. ఇలా అక్రమార్కులతో అంటకాగే వ్యవసాయాధికారులు దోమ పోటు నివారణ మందుల పేరుతో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కేసీ కెనాల్, ఎల్ఎల్సీ, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ ఆయకట్టు పరిధిలో 60వేల ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుతం దోమపోటు బెడద ఉండడంతో అక్రమార్కులు నకిలీ మందులు, దొంగ బయోలను ఇప్పటికే గ్రామాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యాపారం రూ. 200 కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితమే నిషేధించినా.. పంట ఏదైనా ముఖ్యంగా వరికి సంబంధించి సింథటిక్ పైరిత్రాయిడ్స్ 60 రోజుల దశ వరకు వాడరాదు. ఈ మేరకు కొన్నేళ్ల క్రితమే నిషేధం విధించారు. అయితే వీటిని పురుగు మందులు, బయో పెస్టిసైడ్స్ పేరుతో దోమ నివారణ కోసమంటూ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు,ఆత్మకూరు, ఆదోని ప్రాంతాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంది. నకిలీ పురుగు మందులకు ఎమ్మిగనూరు కేంద్ర బిందువుగా మారినట్లు ఆరోపణలున్నాయి. సింతటిక్ పైరిత్రాయిడ్స్వాడకంతో దోమ తగ్గకపోగా మరింత శక్తిని పుంజుకుని వద్ధి చెందుతోందని, ఇది కొనసాగితే మున్ముందు కష్టమని కీటక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పైగా పంటలకు మేలు చేసే కీటకాలు అంతరిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. పంట దిగుబడుల్లో వీటి విషపూరిత రసాయనాల అవశేషాలుండడంతో మనిషి ఆరోగ్యంపై కూడా తీవ్రప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. నకిలీ పురుగుమందుల అడ్డా.. కర్నూలు బైపాస్ రోడ్డు సమీపంలోని కన్యకా పరమేశ్వరీ అలయం వద్దనున్న ఓ గోదాములో నకిలీ పురుగు మందులు, దొంగ బయోలు పెద్ద ఎత్తున నిల్వ చేసి అక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి ఇవి ఇక్కడకు రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా నకిలీలను మార్కెట్లోకి తరలిస్తున్నట్లు సమాచారం. జాతీయ రహదారి పక్కనే భారీ ఎత్తున నకిలీల వెల్లువ కొనసాగుతున్నా చర్యలు లేకపోవడాన్ని బట్టి మన వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది వారితో ఏ స్థాయిలో అంటగాగుతున్నారో ఇట్టే తెలిసిపోతోంది. నిషేధిత మందుల నియంత్రణకు చర్యలు – జేడీఏ ఉమామహేశ్వరమ్మ కర్నూలు సింథటిక్ పైరిత్రాయిడ్స్ కాంబినేషన్ మందులను వరిలో 60 రోజుల వరకు వాడరాదు. ఆహార పంట కావడంతో ఈ మేరకు ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వీటి అమ్మకాలపై ప్రత్యేకంగా దష్టి సారించాం. అయితే వీటిని కూరగాయలు, ఇతర పంటల్లో వాడవచ్చు. వరిలో అయితే 60 రోజుల తర్వాత వాడినప్పటికి పరిమితంగా వాడాలి. వీటి అమ్మకాలు, వరిలో వినియోగంపై దష్టి సారించాలని ఏఓ, ఏడీఏలకు ఆదేశాలు ఇచ్చాం.