వరికి దోమపోటు
Published Fri, Oct 28 2016 2:07 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
- సింతటిక్ పైరిథ్రాయిడ్స్‌తో మరింత ఉద్ధృతం
- నివారణకు డాట్ సెంటర్ శాస్త్రవేత్త సూచనలు
కర్నూలు(అగ్రికల్చర్) :
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 67,985 హెక్టార్లలో వరి సాగైంది. ప్రస్తుతం పంట చిరు పొట్ట దశలో ఉంది. ఈ దశలో సుడిదోమ ఆశించే ప్రమాదం అధికం. దీన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే పంటను రక్షించుకోవచ్చు. వరినాశించే పురుగులో ఎక్కువ నష్టాన్ని కలుగజేసేది సుడి దోమ. దీనినే దోమ పోటు అని కూడా అంటారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని వరి పండించే అన్ని ప్రాంతాల్లో దీని తాకిడి పెరుగుతోంది. వరిని ముఖ్యంగా రెండు రకాల దోమలు ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. అవి తెల్ల వీపు దోమ, రబీలో గోధుమ రంగు దోమ వరిని ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయని కర్నూలు ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్, శాస్త్రవేత్త సుజాతమ్మ(ఫోన్: 9989623810) తెలిపారు. నివారణ విధానాలను కూడా తెలియజేశారు.
తెల్ల వీపు మచ్చ దోమ...
ఇవి గోధుమ రంగు దోమ కంటే చిన్నవిగా ఉంటాయి. తెల్ల పురుగుల ముందు రెక్కలు కలిసేచోట చివర నల్లటి మచ్చ ఉంటుంది. రెక్కల ముందు భాగంలో తెల్లటి మచ్చ ఉంటుంది. ఇవి 6–8 గుడ్లను వరి దుబ్బుల మొదళ్ల దగ్గర ఆకు తొడిమ లోపల కణజాలంలో పెడతాయి. ఈ గుడ్లు విడివిడిగా ఉంటాయి. పిల్ల పురుగులు తెల్లగా ఉండి 8–28 రోజుల్లో పెద్ద పురుగులుగా మారతాయి.
గోధుమ రంగు దోమ...
పెద్ద పురుగులు లేత గోధుమ నుంచి ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఆడ దోమలు మగవాటి కంటే పెద్దవిగా ఉంటాయి. సుడి దోమల్లో రెక్కలున్నవి, లేనివి ఉంటాయి. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు, పండు పక్వదశకు వచ్చినప్పుడు రెక్కలున్న దోమలు అభివృద్ధి చెందుతాయి. తల్లి దోమ 300–500 గుడ్లను ఆకు తొడిమ లోపలి కణజాలంలో గానీ, మధ్య ఈనెలో గాని పెడుతుంది. 2 నుంచి 12గుడ్లను ఒకదాని పక్కన ఒకటి పెట్టి వాటి చివరలను ఒక దానితో ఒకటి కలిపి గుంపుగా చేస్తుంది. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఐదుసార్లు కబుసాన్ని విసర్జించి తర్వాత 15–20 రోజుల్లో తల్లి పురుగు దశకు చేరతాయి.
నష్టపరిచే విధానం...
ముందుగా రెక్కలున్న సుడి దోమలు పిలకలు వేసే దశలో వరిపైరును ఆశిస్తాయి. ఇవి మూడు, నాలుగు వారాల్లో రెక్కలు లేని దోమల్ని (మొదటి సంతతి) ఉత్పత్తి చేస్తాయి. ఆ తర్వాత ఇవి రెండో సంతతిని ఉత్పత్తి చేస్తాయి. ఈ దశలో పిల్ల, తల్లి పురుగులు పైరును తీవ్రంగా నష్టపరుస్తాయి. మనం ఈ దశలో మాత్రమే పురుగుల్ని గుర్తించగలుగుతాము. ఈ సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే రెక్కలున్న మూడో, నాలుగో తరం పురుగులు వృద్ధి చెంది పైరును నష్టపరుస్తాయి. ఈ సుడిదోమలు వరి దుబ్బుల మొదళ్లను ఆశించి రసాన్ని పీలుస్తాయి. దీంతో మొక్కలు గిడసబారి, పోషకాలు అందక పసుపు రంగుకు మారి సుడులు సుడులుగా ఎండిపోతాయి. గోధుమ రంగు దోమల వల్ల ఏర్పడే సుడులు ప్రస్పుటంగా కనిపిస్తాయి. తెల్ల మచ్చ దోమ నష్టం పొలం అంతా విస్తరించి ఉంటుంది. వీటి ఉధృతి అధికంగా ఉన్నప్పుడు వరి కంకి వరకు కూడా ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. తెల్ల మచ్చ దోమ ముఖ్యంగా వరి పిలకలు వేసే తొలి దశలో ఆశిస్తే, గోధుమ రంగు దోమ వరి పొట్ట దశ నుంచి ఆశిస్తుంది. సుడి దోమలు గ్రాసీస్టంట్ వంటి వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. సుడి దోమలు రసం పీల్చినప్పుడు విడుదల చేసే లాలాజలం పోషక కణజాలంతో ఘనీభవిస్తుంది. దీని వలన వేరు వ్యవస్థ నుంచి పోషక పదార్థాలు అందక మొక్కలు ఎండిపోతాయి. సుడిదోమలు ఆకులపై విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థం వలన మసి తెగులు సోకుతుంది. దీంతో కిరణజన్య సంయోగ క్రియ పూర్తిస్థాయిలో జరగక దిగుబడులు తగ్గుతాయి. గింజ గట్టిపడే దశలో దోమలు ఆశించినట్లయితే గింజలు పూర్తిస్థాయిలో పాలు పోసుకోవు. ధాన్యాన్ని మిల్లులో పట్టించినప్పుడు ఎక్కువగా నూకలవుతాయి.
సుడి దోమ ఉధృతికి కారణాలు...
– సిఫారసు చేయని మందులను విచక్షణా రహితంగా పిచికారి చేయడం. నత్రజని ఎరువును అధికంగా వేయడం. అధికంగా నీటిని పెట్టి ఉంచడం. అవసరం లేకున్నా రెండు మూడు రకాల మందుల్ని కలిపి పిచికారి చేయడం.
– సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల్ని వాడటం.
సస్యరక్షణ పద్ధతులు...
–ప్రధాన పొలంలో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల ఎడంతో కాలిబాటలు తీయాలి. నత్రజని ఎరువును సిఫారసు చేసిన మోతాదులో విడతలవారీగా వేయడం.
– దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడప్పుడూ పొలాన్ని ఆరగట్టాలి. సాలీడ్లు, మిరిడ్ నల్లి వంటి మిత్ర పురుగుల్ని సంరక్షించుకోవాలి.
– దుబ్బుకి 10–15 దోమలు కనిపించినప్పుడు లీటరు నీటికి 2.2 మి.లీ. మోనోక్రోటోపాస్/ రెండు మిల్లీ లీటర్ల ఇథోపెన్ ఫ్రార్స్/ 1.5 గ్రాముల ఎసిఫేట్/ 1.6 మిల్లీలీటర్ల బుప్రొఫెజిన్/ ఇమిడాక్రోఫిడ్+ఎథసోల్ కలిపిన మందును లీటరు వీటికి 0.25 గ్రాముల చొప్పున కలిపిన 200 లీటర్ల మందు ద్రావణాన్ని ఎకరా పొలంలో పిచికారీ చేసి దోమను నిర్మూలించుకోవచ్చు. డైనోటెప్యురాన్ 0.4 గ్రా./ పైమెట్రోజైన్ 0.6 గ్రా. లీటరు నీటికి కలిపిన మందు ద్రావణాన్ని 200 లీటర్లు ఎకరా పొలంలో పిచికారి చేసి కూడా దోమను నిర్మూలించుకోవచ్చును.
– సింథటిక్ ఫైరిథ్రాయిడ్ మందులను వాడరాదు. ఇందువల్ల దోమ ఎక్కువ అవుతుంది. అందువల్ల అత్యవసరమైతే తప్ప వీటిని వాడరాదు.
Advertisement