విరుగుడు లేదు విషమే!
– వరిపై సింథటిక్ పైరిత్రాయిడ్ విచ్చలవిడి వినియోగం
– దోమపోటు నివారణ మందుల పేరుతో అమ్మకాలు
– జిల్లాలో రూ.200 కోట్లకుపైగా వ్యాపారం
– అక్రమార్కులతో అంటగాగుతున్న అధికారులు
కర్నూలు(అగ్రికల్చర్): వరిలో దోమ పోటు నివారణ పేరుతో నకిలీ మందులు, బయోలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నా వ్యవసాయశాఖకు ఎంతమాత్రం పట్టడం లేదు. నిషేధిత సింతటిక్ పైరిత్రాయిడ్‌తో విషపూరిత రసాయనాలు మార్కెట్‌లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నా నియంత్రణ చర్యలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నియంత్రణకు చర్యలు తీసుకోకపోగా ఉన్నతాధికారుల తనిఖీల విషయాలను సైతం ముందుగానే తెలియజేసి జాగ్రత్త పడేలా చూస్తుండడం మరింత విస్తుగొలుపుతున్న అంశం. ఇటీవలే అంతర్ జిల్లా వ్యవసాయాధికారుల బందం జిల్లా పర్యటన విషయాన్ని ఓ వ్యవసాయాధికారి ముందుగానే డీలర్లకు తెలియజేసి అలర్ట్ అయ్యేలా చూసినట్లు ఆరోపణలున్నాయి. ఇలా అక్రమార్కులతో అంటకాగే వ్యవసాయాధికారులు దోమ పోటు నివారణ మందుల పేరుతో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు మార్కెట్‌లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కేసీ కెనాల్, ఎల్‌ఎల్‌సీ, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ ఆయకట్టు పరిధిలో 60వేల ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుతం దోమపోటు బెడద ఉండడంతో అక్రమార్కులు నకిలీ మందులు, దొంగ బయోలను ఇప్పటికే గ్రామాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యాపారం రూ. 200 కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం.
కొన్నేళ్ల క్రితమే నిషేధించినా..
పంట ఏదైనా ముఖ్యంగా వరికి సంబంధించి సింథటిక్ పైరిత్రాయిడ్స్ 60 రోజుల దశ వరకు వాడరాదు. ఈ మేరకు కొన్నేళ్ల క్రితమే నిషేధం విధించారు. అయితే వీటిని పురుగు మందులు, బయో పెస్టిసైడ్స్ పేరుతో దోమ నివారణ కోసమంటూ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు,ఆత్మకూరు, ఆదోని ప్రాంతాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంది. నకిలీ పురుగు మందులకు ఎమ్మిగనూరు కేంద్ర బిందువుగా మారినట్లు ఆరోపణలున్నాయి. సింతటిక్ పైరిత్రాయిడ్స్‌వాడకంతో దోమ తగ్గకపోగా మరింత శక్తిని పుంజుకుని వద్ధి చెందుతోందని, ఇది కొనసాగితే మున్ముందు కష్టమని కీటక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పైగా పంటలకు మేలు చేసే కీటకాలు అంతరిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. పంట దిగుబడుల్లో వీటి విషపూరిత రసాయనాల అవశేషాలుండడంతో మనిషి ఆరోగ్యంపై కూడా తీవ్రప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.
నకిలీ పురుగుమందుల అడ్డా..
కర్నూలు బైపాస్ రోడ్డు సమీపంలోని కన్యకా పరమేశ్వరీ అలయం వద్దనున్న ఓ గోదాములో నకిలీ పురుగు మందులు, దొంగ బయోలు పెద్ద ఎత్తున నిల్వ చేసి అక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి ఇవి ఇక్కడకు రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా నకిలీలను మార్కెట్‌లోకి తరలిస్తున్నట్లు సమాచారం. జాతీయ రహదారి పక్కనే భారీ ఎత్తున నకిలీల వెల్లువ కొనసాగుతున్నా చర్యలు లేకపోవడాన్ని బట్టి మన వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది వారితో ఏ స్థాయిలో అంటగాగుతున్నారో ఇట్టే తెలిసిపోతోంది.
నిషేధిత మందుల నియంత్రణకు చర్యలు
– జేడీఏ ఉమామహేశ్వరమ్మ కర్నూలు
సింథటిక్ పైరిత్రాయిడ్స్ కాంబినేషన్ మందులను వరిలో 60 రోజుల వరకు వాడరాదు. ఆహార పంట కావడంతో ఈ మేరకు ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వీటి అమ్మకాలపై ప్రత్యేకంగా దష్టి సారించాం. అయితే వీటిని కూరగాయలు, ఇతర పంటల్లో వాడవచ్చు. వరిలో అయితే 60 రోజుల తర్వాత వాడినప్పటికి పరిమితంగా వాడాలి. వీటి అమ్మకాలు, వరిలో వినియోగంపై దష్టి సారించాలని ఏఓ, ఏడీఏలకు ఆదేశాలు ఇచ్చాం.