Domestic airport
-
విమానాశ్రయ రంగానికి రూ.5,400 కోట్ల నష్టాలు
ముంబై: ఈ ఆర్ధిక సంవత్సరంలో దేశీయ విమానాశ్రయ రంగానికి రూ.5,400 కోట్ల మేర నికర నష్టాలు వాటిల్లుతాయని, అలాగే రూ.3,500 కోట్ల వరకు నగదు నష్టాలు తప్పవని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కోవిడ్–19 వ్యాప్తి కారణంగా ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో రద్దీ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని, ఏడాది కాలంతో పోలిస్తే 66 శాతం మేర ప్యాసింజర్ ట్రాఫిక్ క్షీణించిందని పేర్కొంది. 2020–21 ఆర్ధిక సంవత్సరంలో దేశీయ ప్రయాణికుల రద్దీ 61 శాతం, అంతర్జాతీయ ప్యాసింజర్ ట్రాఫిక్ 85 శాతం మేర తగ్గవచ్చని తెలిపింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో ఈ రంగం నిర్వహణ ఆదాయం 61 శాతం తగ్గి రూ.8,400 కోట్లకు, అదే సమయంలో నిర్వహణ నష్టం రూ.1,700 కోట్లు (–20 శాతం మార్జిన్), నికర నష్టం రూ.5,400 కోట్లకు చేరుకుంటాయని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ హెడ్ శుభం జైన్ అన్నారు. అలాగే ఈ రంగానికి మొత్తం నగదు నష్టాలు రూ.3,500 కోట్లుగా ఉంటాయని పేర్కొన్నారు. విమానాశ్రయ నిర్వాహకుల ద్రవ్యత 2020 మార్చి 31 నాటికి రూ.8,100 కోట్ల నగదు బ్యాలెన్స్‌తో బలంగా ఉంది. ఇవి మూలధనం కోసం, కార్యాచరణ వ్యయాలు, రుణ బాధ్యతలు, ఈక్విటీ అవసరాలను తీర్చడంలో సహకరించాయని చెప్పారు. అయితే మార్చితో ముగియనున్న ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్వాహకుల వద్ద ఉన్న ద్రవ్యత రూ.5,700 కోట్లకు క్షీణించే సూచనలున్నాయని తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ట్రాఫిక్‌లో ఏడాదికి 130 శాతంతో భారీ రికవరీని సాధిస్తుందని, సామూహిక కోవిడ్ టీకాలు, వ్యాపార ప్రయాణాలు పునఃప్రారంభం కావటం, లీజర్ ట్రావెల్స్ వృద్ధి చెందటం, రియల్ ఎస్టేట్ ల్యాండ్ పార్సల్స్ వంటి నాన్–ఏరో విభాగాల ద్వారా సంపాదన వంటివి ఈ రంగాల ప్రధాన వృద్ధి చోదకాలుగా నిలుస్తాయని తెలిపారు. దేశీయ ట్రాఫిక్‌తో పోలిస్తే అంతర్జాతీయ ప్రయాణీకులతో ఎక్కువ ఆదాయం చేకూరుతుందని.. అయితే కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలున్నాయని ఇదే 2021 ఫైనాన్షియల్ ఇయర్లో పరిశ్రమకు ప్రతికూలంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన దేశాల్లో కోవిడ్–19 టీకా ప్రారంభమైనప్పటికీ.. దేశవ్యాప్తంగా ఇటీవల కోవిడ్–19 కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై పరిమితులు విధించారు. ఇది ట్రాఫిక్ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. 2022 ఆర్ధిక సంవత్సరంలో ప్రయాణీకుల రద్దీ ప్రీ–కోవిడ్ స్థాయిలో దాదాపు 80 శాతానికి చేరుకునే సూచనలున్నాయని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. వినియోగదారులు సుంకం, నిర్వహణ ఖర్చు రికవరీని అనుమతిస్తుంది కాబట్టి రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్స్ నుంచి మెరుగైన రేటింగ్‌లు పొందేందుకు విమానాశ్రయ ఆపరేటర్లు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. -
శంషాబాద్ రెడీ..
శంషాబాద్: సుదీర్ఘకాలం లాక్డౌన్ తర్వాత సాధారణ ప్రయాణికులతో కూడిన విమానాల రాకపోకలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టును అన్ని విధాలుగా సిద్ధం చేశారు. లాక్డౌన్ సమయంలో కార్గోతో పాటు వేరే దేశాల నుంచి మన వారిని తీసుకొచ్చే విమానాలు, రిలీఫ్ విమానాలు మాత్రమే రాకపోకలు సాగించాయి. కేంద్ర పౌర విమానయాన మార్గదర్శకాల మేరకు తొలి దశలో 30 శాతం విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చకచకగా జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించి విమానాశ్రయాన్ని సిద్ధం చేసినట్లు ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్జీకే కిశోర్ తెలిపారు. శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో మాట్లాడుతూ.. విమానం లోపల భౌతిక దూరం, నిబంధనలు ఉండేందుకు అవకాశం లేదని.. దీంతో ప్రయాణికులు స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సీట్ల మధ్య దూరం ఉండేలా ఎలాంటి మార్గదర్శకాలు లేవని చెప్పారు. విమానంలో ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విమానం లోపల ఆహారం సరఫరా ఉండదని పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మధుమేహ రోగులకు కొందరికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. పదేళ్లలోపు చిన్నారులు.. గర్భిణులు విమాన ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచించారు. ఎయిర్‌పోర్టు విలేజ్ వద్ద భౌతిక దూరం గుర్తులు వేస్తున్న సిబ్బంది ఎయిర్‌పోర్టులో ఇలా.. ఎయిర్‌పోర్టు ప్రవేశ మార్గం నుంచి భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా గుర్తులు ఏర్పాటు చేశారు. కాంటాక్ట్ లెస్ విధానంలో ప్రయాణికులు తమ పత్రాలను కెమెరా ముందు పెడితే వాటిని సంబంధిత సీఐఎస్ఎఫ్ అధికారులు కంప్యూటర్లో పరిశీలించి అనుమతిస్తారు. అలాగే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేస్తారు. ప్రయాణికులకు అందుబాటులో అన్ని ప్రాంతాల్లో శానిటైజర్లు ఏర్పాట్లు చేశారు. డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా ప్రయాణికులను లోపలికి అనుమతిస్తారు. ప్రయాణికులకు పరిశుభ్రత.. భౌతిక దూరం నిబంధనలను అప్రమత్తం చేసేందుకు ఎయిర్‌పోర్టులో అన్ని ఏర్పాట్లు చేశారు. స్మార్ట్‌ఫోన్ ద్వారానే చెక్–ఇన్ కియోస్క్‌లు మానిటరింగ్ చేయొచ్చు. కాగా, ప్రారంభంలో విమానయానం నెమ్మదించినా.. భవిష్యత్తులో ఆశాజనకంగానే ఉండొచ్చని కిశోర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 36 ప్రాంతాలకు రాకపోకలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భౌతిక దూరం కోసం ఏర్పాటు చేసిన పాద సూచికలు, ప్రయాణికులకు ఏర్పాటు చేసిన శానిటైజర్ -
కొత్తగూడెం, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టులు
♦ కలెక్టర్ల నుంచి ప్రతిపాదనలు కోరిన రాష్ట్ర ప్రభుత్వం ♦ లైన్‌క్లియర్ చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. కొత్తగూడెం డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు కేంద్ర పౌర విమానయాన శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఏర్పాట్లలో నిమగ్నమైంది. వచ్చే ఏడాది మార్చి కల్లా కొత్తగూడెం ఎయిర్‌పోర్టు పనులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 2 కల్లా విమానాశ్రయం నిర్మించే ప్రాంతం, దాని విస్తీర్ణం, నమూనా తదితర అంశాలపై స్పష్టత రానుంది. ఎయిర్‌పోర్టును ఎక్కడ నిర్మించాలి.. అందుకు సరిపోయే స్థలం ఒకేచోట ఎక్కడ దొరుకుతుందనే వివరాలు వెంటనే పంపాలంటూ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల విభాగం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కోరింది. కోల్‌బెల్ట్ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న కొత్తగూడెం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రం శివార్లలో ఇప్పటికే ఓ మిలిటరీ ఎయిర్‌బేస్ ఉంది. దాన్ని ఆనుకునే డొమెస్టిక్ ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దండకారణ్యంలోని ఈ ప్రాంతం మహారాష్ట్ర గడ్చిరోలి సరిహద్దుల్లో ఉంది. కొంత నక్సల్ ప్రభావితం కావడంతో ఇక్కడ ఆర్మీ రాకపోకలకు అనుగుణంగా ఎయిర్‌బేస్‌ను ఏర్పాటు చేశారు. వరంగల్‌కు అడ్డంకిగా జీఎంఆర్ కొత్తగూడెంతో పాటు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్‌ల్లో డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వీటిలో కొత్తగూడెం, ఆదిలాబాద్‌ల్లో విమానాశ్రయాల నిర్మాణానికి అనుమతి లభించింది. ఈ రెండు ప్రాంతాలు రాష్ట్ర రాజధానికి దూరంగా ఉన్నాయి. వరంగల్‌లో డొమెస్టిక్ విమానాశ్రాయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు జీఎంఆర్‌తో చేసుకున్న ఒప్పందాలు అడ్డంకిగా మారినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వరంగల్‌లోని రంగశాయిపేటలో విమాన రాకపోకలకు అనుగుణంగా ఓ రన్‌వే స్ట్రిప్ ఎప్పటి నుంచో ఉంది. ఒకప్పుడు వీవీఐపీల కోసమే వినియోగించిన దీన్ని పూర్తిస్థాయి దేశీయ విమానాశ్రయంగా మార్చాలనే ప్రతిపాదన ఉంది. శంషాబాద్ విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ డిస్టెన్స్‌లో 150 కి.మీ. పరిధిలో.. వచ్చే 50 ఏళ్లలో మరో విమానాశ్రయం నిర్మించరాదనేది జీఎంఆర్‌తో ఒప్పంద పత్రాల సారాంశం. దీంతో వరంగల్‌లో పూర్తిస్థాయి ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు జీఎంఆర్ అనుమతి తప్పనిసరి. వరంగల్-హైదరాబాద్‌ను ఇండస్ట్రియల్ కారిడార్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం నేపథ్యంలో వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు ప్రాధాన్యతను సంతరించుకుంది. బేగంపేటలో ట్రైనింగ్ అకాడమీ హైదరాబాద్‌లోని బేగంపేటలో వైమానిక కోర్సులు, శిక్షణ, ఎయిర్‌ఫోర్స్ స్టడీస్ కోసం శిక్షణ కేంద్రం నిర్వహించేలా ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 18న ఫ్రెంచ్కు చెందిన అక్విటైన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. బేగంపేటలోని పాత విమానాశ్రయాన్ని ప్రతి ఏటా కేంద్రం నిర్వహించే జాతీయ ఎయిర్‌షోలకు, వీవీఐపీల అవసరాలకు వినియోగించే విధంగా కొనసాగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.