ముంబై: ఈ ఆర్ధిక సంవత్సరంలో దేశీయ విమానాశ్రయ రంగానికి రూ.5,400 కోట్ల మేర నికర నష్టాలు వాటిల్లుతాయని, అలాగే రూ.3,500 కోట్ల వరకు నగదు నష్టాలు తప్పవని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కోవిడ్–19 వ్యాప్తి కారణంగా ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో రద్దీ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని, ఏడాది కాలంతో పోలిస్తే 66 శాతం మేర ప్యాసింజర్ ట్రాఫిక్ క్షీణించిందని పేర్కొంది. 2020–21 ఆర్ధిక సంవత్సరంలో దేశీయ ప్రయాణికుల రద్దీ 61 శాతం, అంతర్జాతీయ ప్యాసింజర్ ట్రాఫిక్ 85 శాతం మేర తగ్గవచ్చని తెలిపింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో ఈ రంగం నిర్వహణ ఆదాయం 61 శాతం తగ్గి రూ.8,400 కోట్లకు, అదే సమయంలో నిర్వహణ నష్టం రూ.1,700 కోట్లు (–20 శాతం మార్జిన్), నికర నష్టం రూ.5,400 కోట్లకు చేరుకుంటాయని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ హెడ్ శుభం జైన్ అన్నారు. అలాగే ఈ రంగానికి మొత్తం నగదు నష్టాలు రూ.3,500 కోట్లుగా ఉంటాయని పేర్కొన్నారు.
విమానాశ్రయ నిర్వాహకుల ద్రవ్యత 2020 మార్చి 31 నాటికి రూ.8,100 కోట్ల నగదు బ్యాలెన్స్‌తో బలంగా ఉంది. ఇవి మూలధనం కోసం, కార్యాచరణ వ్యయాలు, రుణ బాధ్యతలు, ఈక్విటీ అవసరాలను తీర్చడంలో సహకరించాయని చెప్పారు. అయితే మార్చితో ముగియనున్న ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్వాహకుల వద్ద ఉన్న ద్రవ్యత రూ.5,700 కోట్లకు క్షీణించే సూచనలున్నాయని తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ట్రాఫిక్‌లో ఏడాదికి 130 శాతంతో భారీ రికవరీని సాధిస్తుందని, సామూహిక కోవిడ్ టీకాలు, వ్యాపార ప్రయాణాలు పునఃప్రారంభం కావటం, లీజర్ ట్రావెల్స్ వృద్ధి చెందటం, రియల్ ఎస్టేట్ ల్యాండ్ పార్సల్స్ వంటి నాన్–ఏరో విభాగాల ద్వారా సంపాదన వంటివి ఈ రంగాల ప్రధాన వృద్ధి చోదకాలుగా నిలుస్తాయని తెలిపారు.
దేశీయ ట్రాఫిక్‌తో పోలిస్తే అంతర్జాతీయ ప్రయాణీకులతో ఎక్కువ ఆదాయం చేకూరుతుందని.. అయితే కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలున్నాయని ఇదే 2021 ఫైనాన్షియల్ ఇయర్‌లో పరిశ్రమకు ప్రతికూలంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన దేశాల్లో కోవిడ్–19 టీకా ప్రారంభమైనప్పటికీ.. దేశవ్యాప్తంగా ఇటీవల కోవిడ్–19 కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై పరిమితులు విధించారు. ఇది ట్రాఫిక్ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. 2022 ఆర్ధిక సంవత్సరంలో ప్రయాణీకుల రద్దీ ప్రీ–కోవిడ్ స్థాయిలో దాదాపు 80 శాతానికి చేరుకునే సూచనలున్నాయని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. వినియోగదారులు సుంకం, నిర్వహణ ఖర్చు రికవరీని అనుమతిస్తుంది కాబట్టి రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్స్ నుంచి మెరుగైన రేటింగ్‌లు పొందేందుకు విమానాశ్రయ ఆపరేటర్లు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment