ఎస్‌యూవీలు.. తగ్గేదేలే!
గత కొన్నేళ్లుగా దేశీ ఆటో రంగంలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. కార్ల విభాగంలో కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్‌యూవీలు) అమ్మకాలు యమ స్పీడ్‌గా వృద్ధి చెందుతున్నాయి. వెరసి అత్యధిక శాతం కస్టమర్లు ఆసక్తి చూపే చిన్న ప్రీమియం కార్ల విక్రయాలను ఇవి వెనక్కి నెడుతున్నాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి 11 నెలల్లో మొత్తం అమ్మకాలలో చిన్న ఎస్‌యూవీల వాటా 22 శాతానికి ఎగసింది. ఇదే సమయంలో హ్యాచ్‌బ్యాక్ కార్ల వాటా 19 శాతంగా నమోదైంది. ఇతర వివరాలు చూద్దాం...
దేశీయంగా ప్రయాణికుల(ప్యాసింజర్) వాహనాల విభాగంలో ఇటీవల కొన్నేళ్లుగా ఎస్‌యూవీలు యమ స్పీడును ప్రదర్శిస్తున్నాయి. అమ్మకాలలో ప్రీమియం చిన్న కార్లను దాటి వేగంగా పరుగెడుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది తొలి 11 నెలల్లో వీటి వాటా 22 శాతానికి చేరింది.
వెరసి ఎప్పటినుంచో అమ్మకాలలో మార్కెట్ లీడర్లుగా నిలుస్తున్న హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాలను వెనక్కి నెట్టాయి. ఏప్రిల్–ఫిబ్రవరిలో వీటి వాటా 19%కి పరిమితంకావడమే ఇందుకు నిదర్శనం. ఈ బాటలో దేశీయంగా విక్రయమవుతున్న ప్రతీ రెండు కార్లలో నూ ఒకటి ఎస్‌యూవీయే ఉంటున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. వెరసి మార్చితో ముగియనున్న ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడవుతున్న విభాగంగా ఎంట్రీలెవెల్ ఎస్‌యూవీలు నిలవనున్నట్లు తెలియజేశారు!
వివిధ మోడళ్ల ఎఫెక్ట్
కొన్నేళ్లుగా రూ. 10 లక్షల ధరలలోపు కొత్త యూఎస్వీ మోడళ్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. వీటికి సులభమైన ఫైనాన్స్ సౌకర్యాలు జత కలుస్తున్నాయి. మరోపక్క సరఫరా సమస్యలతో హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల తయారీ నీరసించడం ఎస్‌యూవీలకు డిమాండును పెంచుతోంది. పరి శ్రమ వర్గాల అంచనాల ప్రకారం మారుతీ సుజుకీ బ్రెజ్జా, టాటా నెక్సాన్, పంచ్, రేనాల్ట్ కైగర్, హ్యుందాయ్ వెన్యూ మోడళ్లు ఉమ్మడిగా తొలి 11 నెలల్లో 6,00,000 వరకూ విక్రయమయ్యాయి.
ఇదే కాలంలో వివిధ కంపెనీల హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు 5,40,000 అమ్ముడైనట్లు అంచనా. ప్రారంభ శ్రేణి ఎస్‌యూవీల స్పీడుకు ప్రధానంగా మూడు కారణాలున్నట్లు మారుతీ సుజుకీ సీనియర్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ చెబుతున్నారు. పలు కొత్త మోడళ్లు విడుదలకావడం, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్ ధరలతో పోలిక వంటి అంశాలను ప్రస్తావించారు. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో బ్రెజ్జా అత్యధికంగా విక్రయమవుతున్న మోడల్‌గా పేర్కొన్నారు.
జాబితాలో కంపెనీలు..
హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలలో సగం వాటా ఎస్యూవీలదేకాగా.. టాటా మోటా ర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా , జీప్, కియా, ఎంజీ మోటార్స్, నిస్సాన్ ఎస్‌యూవీలను రూపొందించడంలో ముందుంటున్నాయి. గత మూడు, నాలుగేళ్లలోనే 12 రకాల కొత్త యూఎస్‌వీలు మార్కెట్లలోకి ప్రవేశించాయి. మొత్తం ఎస్‌యూవీల మార్కెట్లో ఎంట్రీలెవెల్ ఎస్‌యూవీల వాటా 60 శాతంకావడం గమనించదగ్గ అంశం!