కార్ల పరుగు: సియాం
న్యూఢిల్లీ: దేశీయంగా కార్ల అమ్మకాలు సెప్టెంబర్లో పుంజుకున్నాయి. గత నెలలో మొత్తం 1,56,018 కార్లు అమ్ముడయ్యాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధికంగా కార్లు విక్రయమైన నెల ఇదేనని ఆయన పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా మందగమనంగా ఉన్న కార్ల విక్రయా లు సెప్టెంబర్లో పెరగడంతో వాహన మార్కెట్ పుంజుకుంటోందన్న ఆశలను రేకెత్తిస్తోందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
కనిష్ట క్షీణత : ఒక్క కార్లే కాకుండా, ప్రయాణికుల, యుటిలిటీ వాహనాలు, టూ- వీలర్ల అమ్మకాలు సెప్టెంబర్లో పుంజుకున్నాయని, ఇదే జోరు కొనసాగగలదన్న ఆశాభావాన్ని విక్రమ్ కిర్లోస్కర్ వ్యక్తం చేశారు. అయి తే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు వృద్ధి సాధించే అవకాశాలు తక్కువేనని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కార్ల అమ్మకాలు 4.67 శాతం క్షీణించాయని, 2002-03 ఆర్థిక సంవత్సరం తర్వాత కనిష్ట క్షీణత ఇదేనని వివరించారు. 2002-03 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కార్ల అమ్మకాల క్షీణత 6.96 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. వర్షాలు బాగా కురవడం వల్ల పండుగల సీజన్లో అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వివరించారు.