domestic cylinder
-
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర
సాక్షి, హైదరాబాద్: సామాన్యుడి నెత్తిపై వంట గ్యాస్ సిలిండర్ ‘బాదుడు’ బరువు మరింత పెరిగింది. ఒక్కసారిగా రూ. 50 పెంచేశాయి చమురు సంస్థలు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచినట్లు, పెంచిన ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చినట్లు ప్రకటించాయి. దీంతో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1052కి చేరింది. గత వారం వ్యవధిలో సిలిండర్ బుక్ చేసుకున్న కొందరికి సైతం ఈ పెంపు వర్తించడం గమనార్హం. ఇక నెల గ్యాప్ తర్వాత ఇప్పుడు యాభై రూపాయలు పెంచాయి కంపెనీలు. డొమెస్టిక్ సిలిండర్లపై మార్చి 22న పెంపు ఇచ్చిన కంపెనీలు.. ఆ టైంలోనూ 50 రూ. పెంచాయి. ఏప్రిల్‌లో పెంపు ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. కమర్షియల్ సిలిండర్ ధరలూ ఈ మధ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఏకంగా 102 రూ. పెంచాయి కంపెనీలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2, 563గా ఉంది. చదవండి: సంతానోత్పత్తి తగ్గింది.. ఊబకాయం పెరిగింది -
పక్కదారి పడుతున్న గృహావసర సిలిండర్లు
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ‘డెమెస్టిక్’ గ్యాస్ సిలిండర్ల దందా కమర్షియల్‌గా సాగుతోంది. గృహావసరాలకు వినియోగించే(డొమెస్టిక్) సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు యథేచ్ఛగా పక్కదారి పడుతున్నాయి. ఈ వ్యాపారం ప్రధానంగా నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ లాంటి పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా జోరుగా నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలో, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లలో ఇంటి సిలిండర్లను దొంగచాటున వినియోగిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుండడంతో పాటు కొంత మంది ఏజెన్సీదారులకు తెరచాటున ఇదొక వ్యాపారంగా మారిపోయింది. అయితే డొమెస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా నిరంతరంగా తనిఖీలు చేయాల్సిన సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల కాలంలో తనిఖీలు చేయడం మానేశారు. ఎప్పుడో ఒకసారి తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర వ్యాపారాలకు కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వ నిబంధనలున్నాయి. అయితే చాలామట్టుకు ఆ నిబంధనలను పాటించడం లేదు. ఎందుకంటే 19 కిలోలు గల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రసుతం రూ.1400 వరకు ఉంది. అదే గృహావసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 14.6 కిలోలు ఉండి దాని విలువ రూ.670 వరకు ఉంది. ఈ లెక్కన కమర్షియల్ సిలిండర్‌కు వెచ్చించే డబ్బులతో రెండు డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేయవచ్చు. గ్యాస్ కూడా ఎక్కువగా వస్తుంది. దీంతో హోటళ్లలో, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల నిర్వాహకులు ఇది తప్పని తెలిసినా డొమెస్టిక్ గ్యాస్‌ను వినియోగించడానికి వక్ర మార్గాన్ని ఆచరిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలను మచ్చిక చేసుకుని డొమెస్టిక్ సిలిండర్లను సబ్సిడీ లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇటు గ్యాస్ ఏజెన్సీలకు కూడా ఒక్కో సిలిండర్‌పై రూ.200 వరకు లాభం రావడంతో ‘డొమెస్టిక్’ దందా ‘మూడు పువ్వులు, ఆరు కాయలు’గా మారింది. ఇటు సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏజెన్సీలతో మిలాఖత్ అయ్యారనే ఆరోపణలున్నాయి. అందుకే వీరి డొమెస్టిక్ దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తనిఖీలు అంతంతే... హోటల్లో డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు(ఫైల్) జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సింగిల్ కనెక్షన్లు సుమారు 2లక్షల 7వేల వరకున్నాయి. డబుల్ కనెక్షన్లు లక్షా 19వేల వరకు, దీపం కనెక్షన్లు 79వేల వరకు, సీఎస్ఆర్ కనెక్షన్లు 28,500 వరకు ఉన్నాయి. సిలిండర్లను సరఫరా చేసేందుకు ఇండియన్, హెచ్‌పీ, భారత్ కలిపి గ్యాస్ ఏజెన్సీలు 35 వరకు ఉన్నాయి. అయితే కమర్షియల్ సిలిండర్లు మాత్రం 3,400 వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా అంతటా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, టిఫిన్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లు హోటళ్ల సామర్థ్యం ఆధారంగా వారం ఒకటి నుంచి రెండు, మరి కొన్నింటిలో నెలకు ఐదు వరకు వినియోగం అవుతున్నాయి. ఒక కమర్షియల్ సిలిండర్‌పై వెళ్లదీయడం సాధ్యం కాని పని. ఈ సందర్భంగా డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్నారు. కార్లు, ఇతర వాహనాల్లో కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఎక్కిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా గృహావసరాలకు వినియోగించే సిలిండర్లు పక్కదారి పడుతున్నా అధికారులు మాత్రం ‘మామూలు’గానే తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
ఎల్పీజీ రీ‘ఫుల్’
రీఫిల్లింగ్ పైకొరవడిన నిఘా పుట్టగొడుగుల్లా అక్రమ కేంద్రాలు సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) అక్రమ వ్యవహారంపై అధికార యంత్రాంగం మళ్లీ గప్‌చుప్ అయింది. భారీ విస్పోటనానికి దారితీసి ప్రాణాలు బలిగొన్న ఎల్పీజీ అక్రమ రీ ఫిల్లింగ్‌పై సిరియస్‌నెస్ వారం రోజులకే తుస్సుమంది. పోలీసు, సివిల్ సప్లై అధికారుల హడావుడి మొక్కుబడి దాడులకే పరిమితమయింది. బడా కేంద్రాలను వదిలి చిన్న, చితక కేంద్రాలపై దాడులు నిర్వహించి అధికారులు చేతులు దులుపుకున్నారు. అధికారులు అనుకున్నదే తరువాయి ఎలాంటి రిస్క్ లేకుండా కేంద్రాల గుర్తింపు, కుప్పలు తెప్పలుగా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లు పట్టుబడిన తీరు పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో అధికారులకు అక్రమ కేంద్రాలపై పూర్తి స్థాయి సమాచారం ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ప్రత్యక్షంగా పట్టుబడిన అక్రమార్కులపై సైతం ఉదాసీన వైఖరీ మరింత విస్మయానికి గురిచేస్తోంది. పర్యవేక్షణ కరువు డొమెస్టిక్ ఎల్పీజీపై అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది.ఈ వ్యవహారాన్ని నాలుగైదు శాఖలు పర్యవేక్షించాల్సి ఉన్నా.. ఎవరికి వారే యమున తీరే అన్న చందంగా పరిస్థితి తయారైంది. దీంతో వంటగ్యాస్ పరికరాల ముసుగులో డొమెస్టిక్ సిలిండర్ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు , టాక్స్ చెల్లించకుండా ఐదు కిలోల సిలిండర్లతోపాటు ఆయిల్ కంపెనీల సిలిండర్లు విక్రయిస్తున్నారు. దీంతో కాలం చెల్లిన సిలిండర్లు కూడా రీఫిల్లింగ్ జరిగి విస్పోటనానికి దారితీస్తోంది. అధికారుల అండదండలతోనే.. అధికారుల అండదండలతోనే ఎల్పీజీ అక్రమ రీఫిల్లింగ్ దందా సాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్ కంపెనీల గ్యాస్ డిస్టిబ్యూటర్లు, సివిల్సప్లై, పోలీసు శాఖ అండదండలతోనే అక్రమ రీఫిల్లింగ్ జోరుగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్పీజీ డిస్టిబ్యూటర్ సహకారం లేనిదే పదుల నుంచి వందల సంఖ్యలో డొమెస్టిక్ సిలిండర్ల సరఫరా సాధ్యపడని విషయం. చిన్న చితక కేంద్రాల నిర్వహకులు వినియోగదారులను రీఫిల్లింగ్ కొనుగోలు చేస్తున్నప్పటికీ బడా కేంద్రాలకు మాత్రమే డిస్టిబ్యూటర్ల నుంచే నేరుగా సరఫరా సాగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అటో డ్రైవర్లు డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్‌పై ఆధారపడటంతో రీఫిల్లింగ్‌కు డిమాండ్ పెరిగింది. నగరంలో అక్రమ రీఫిల్లింగ్‌తో విస్పోటనం సంభవించినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండటం అనుమానాలకు తావిస్తోంది.