ఎల్పీజీ రీ‘ఫుల్’
- రీఫిల్లింగ్ పైకొరవడిన నిఘా
- పుట్టగొడుగుల్లా అక్రమ కేంద్రాలు
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) అక్రమ వ్యవహారంపై అధికార యంత్రాంగం మళ్లీ గప్‌చుప్ అయింది. భారీ విస్పోటనానికి దారితీసి ప్రాణాలు బలిగొన్న ఎల్పీజీ అక్రమ రీ ఫిల్లింగ్‌పై సిరియస్‌నెస్ వారం రోజులకే తుస్సుమంది. పోలీసు, సివిల్ సప్లై అధికారుల హడావుడి మొక్కుబడి దాడులకే పరిమితమయింది. బడా కేంద్రాలను వదిలి చిన్న, చితక కేంద్రాలపై దాడులు నిర్వహించి అధికారులు చేతులు దులుపుకున్నారు.
అధికారులు అనుకున్నదే తరువాయి ఎలాంటి రిస్క్ లేకుండా కేంద్రాల గుర్తింపు, కుప్పలు తెప్పలుగా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లు పట్టుబడిన తీరు పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో అధికారులకు అక్రమ కేంద్రాలపై పూర్తి స్థాయి సమాచారం ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ప్రత్యక్షంగా పట్టుబడిన అక్రమార్కులపై సైతం ఉదాసీన వైఖరీ మరింత విస్మయానికి గురిచేస్తోంది.
పర్యవేక్షణ కరువు
డొమెస్టిక్ ఎల్పీజీపై అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది.ఈ వ్యవహారాన్ని నాలుగైదు శాఖలు పర్యవేక్షించాల్సి ఉన్నా.. ఎవరికి వారే యమున తీరే అన్న చందంగా పరిస్థితి తయారైంది. దీంతో వంటగ్యాస్ పరికరాల ముసుగులో డొమెస్టిక్ సిలిండర్ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు , టాక్స్ చెల్లించకుండా ఐదు కిలోల సిలిండర్లతోపాటు ఆయిల్ కంపెనీల సిలిండర్లు విక్రయిస్తున్నారు. దీంతో కాలం చెల్లిన సిలిండర్లు కూడా రీఫిల్లింగ్ జరిగి విస్పోటనానికి దారితీస్తోంది.
అధికారుల అండదండలతోనే..
అధికారుల అండదండలతోనే ఎల్పీజీ అక్రమ రీఫిల్లింగ్ దందా సాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్ కంపెనీల గ్యాస్ డిస్టిబ్యూటర్లు, సివిల్‌సప్లై, పోలీసు శాఖ అండదండలతోనే అక్రమ రీఫిల్లింగ్ జోరుగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్పీజీ డిస్టిబ్యూటర్ సహకారం లేనిదే పదుల నుంచి వందల సంఖ్యలో డొమెస్టిక్ సిలిండర్ల సరఫరా సాధ్యపడని విషయం.
చిన్న చితక కేంద్రాల నిర్వహకులు వినియోగదారులను రీఫిల్లింగ్ కొనుగోలు చేస్తున్నప్పటికీ బడా కేంద్రాలకు మాత్రమే డిస్టిబ్యూటర్ల నుంచే నేరుగా సరఫరా సాగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అటో డ్రైవర్లు డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్‌పై ఆధారపడటంతో రీఫిల్లింగ్‌కు డిమాండ్ పెరిగింది. నగరంలో అక్రమ రీఫిల్లింగ్‌తో విస్పోటనం సంభవించినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండటం అనుమానాలకు తావిస్తోంది.