ఇలాంటి సిక్స్ ఎప్పుడూ చూసుండరు!
సాక్షి, స్పోర్ట్స్ : ఇప్పటివరకు సిక్స్‌లంటే గాల్లో నుంచి బౌండరీ అవతల పడటం చూశాం. స్టేడియం బయట పడ్డ సిక్స్‌లను కూడా చూశాం. కానీ న్యూజిలాండ్ దేశవాళి క్రికెట్లో నమోదైన ఓ సిక్సు మాత్రం ఇంత వరకు ఎవరు చూసుండరు. ఫోర్డ్ ట్రోఫీలో భాగంగా ఆక్లాండ్-క్యాంటెర్బరీల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో గమ్మత్తైన ఓ సిక్సు నమోదైంది.
ఇన్నింగ్స్ 19 ఓవర్లో ఆక్లాండ్ బ్యాట్స్‌మన్ జీత్రావెల్ కొట్టిన ఈ సిక్సు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. క్యాంటెర్బరీ కెప్టెన్ ఆండ్రూ ఎల్లిస్ ఈ ఓవర్ వేయగా ఆక్లాండ్ బ్యాట్స్‌మన్ జీత్రావెల్ స్టేట్‌గా షాట్ ఆడాడు. అయితే బంతి నేరుగా ఎల్లిస్ తలకు బలంగా తగిలింది. దీంతో ఒక్కసారిగా మైదానంలోని ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు. ఎల్లిస్‌కు గాయమైందో ఏమో అని కంగారు పడ్డారు. అతనికి ఎలాంటి గాయం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ఆ బంతి అతని తలకు తగిలి నేరుగా బౌండరీ అవతల పడింది. తొలుత అంపైర్ ఫోర్ ఇవ్వగా రిప్లేలో సిక్స్ అని తేలడంతో అందరు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
రావెల్ అద్భుత సెంచరీ సాధించడంతో ఈ మ్యాచ్‌లో ఆక్లాండ్ గెలుపోందింది. మ్యాచ్ అనంతరం రావెల్ మాట్లాడుతూ.. ‘ఆండ్రూ ఎల్లిస్ గాయపడ్డాడని చాలా కంగారు పడ్డా. నా వల్ల అతనికి గాయమైందో ఏమోనని ఆందోళన చెందా. కానీ అతనికేం కాలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నా. ఇలాంటి అనుభవం ఎవరికి ఎదురుకాలేదనుకుంటా’ అని పేర్కొన్నాడు.
గాయపడ్డ ఆండ్రూ ఎల్లీస్.. కంగారుపడుతున్న జీత్రావెల్