సెన్సెక్స్ 402 పాయింట్లు జూమ్
వారం రోజుల గరిష్టంలో క్లోజింగ్
- రెండు రోజుల్లో 826 పాయింట్ల పెరుగుదల
- 7,800 పాయింట్ల పైకి నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయంగా సంస్కరణల జోరు వార్తలతో బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 402 పాయింట్లు ఎగిసింది. వారం రోజుల గరిష్ట స్థాయి 25,720 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా కీలకమైన 7,800 పాయింట్ల మార్కును అధిగమించింది. కేంద్ర క్యాబినెట్ స్పెక్ట్రం ట్రేడింగ్ నిబంధనలు ఓకే చేయడం, గోల్డ్ సావరీన్ బాండ్లకు లైన్ క్లియర్ చేయడం తదితర అంశాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి.
ఇన్వెస్టర్లకు ఉత్సాహమిచ్చే పలు చర్యలతో పాటు అమెరికా సూచీలు సానుకూలంగా ఉండటం, చైనాలో ప్రభుత్వ ఆర్థిక సహాయక ప్యాకేజీ ఆశలతో స్థిరత్వం నెలకొనే సంకేతాలు, జపాన్ సూచీలు 2008 తర్వాత తొలిసారి అత్యంత భారీగా ఎగియడం మొదలైనవి కూడా మార్కెట్లకు తోడ్పాటునిచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలపడి 66.41కి పెరగడం సైతం సెంటిమెంటుకు తోడైంది. సెన్సెక్స్ ఇంట్రా డేలో 25,821 పాయింట్ల గరిష్ట స్థాయిని కూడా తాకింది. చివరికి 1.59 శాతం లాభంతో 25,720 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 3 తర్వాత ఇదే అత్యధిక స్థాయి క్లోజింగ్. దీంతో రెండు రోజుల్లోనే సెన్సెక్స్ 826 పాయింట్లు లాభపడినట్లయింది. అటు నిఫ్టీ 130 పాయింట్లు పెరిగి 7,819 పాయింట్ల వద్ద ముగిసింది.