domestic smartphone
-
స్మార్ట్ఫోన్ల మార్కెట్@50 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు యాపిల్, శాంసంగ్ విక్రయించే ప్రీమియం డివైజ్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల మార్కెట్ ఈ ఏడాది (2025లో) 50 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4,28,900 కోట్లు) చేరవచ్చని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ టెక్నాలజీ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం 2021లో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పరిమాణం 37.9 బిలియన్ డాలర్లుగా (రూ. 3.25 లక్షల కోట్లు) నమోదైంది. ‘భారతీయ స్మార్ట్ఫోన్ల మార్కెట్ ఈ ఏడాది 50 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించి, రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది. ప్రీమియం, అ్రల్టా–ప్రీమియం సెగ్మెంట్లలో ఆకర్షణీయమైన ఆప్షన్లను అందిస్తూ యాపిల్, శాంసంగ్‌లాంటి బ్రాండ్లు మార్కెట్ వృద్ధికి సారథ్యం వహిస్తున్నాయి‘ అని నివేదిక వివరించింది. 2025లో తొలిసారిగా దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సగటు రిటైల్ విక్రయ ధర 300 డాలర్ల మార్కును (సుమారు రూ. 25,700) అధిగమించవచ్చని నివేదిక పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల విభాగం ద్వారా యాపిల్ ఇండియా రూ. 67,122 కోట్లు, శాంసంగ్ రూ. 71,158 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → స్థానికంగా తయారీ, వివిధ ఐఫోన్ల మోడల్స్ ధరల తగ్గింపు వల్ల యాపిల్ విక్రయించే ప్రో మోడల్స్‌కి డిమాండ్ పటిష్టంగా ఉండవచ్చు. అదే సమయంలో మరింత విలువైన ఫీచర్లు ఉండే డివైజ్‌లు, ముఖ్యంగా తమ ఫ్లాగ్షిప్ ఎస్ సిరీస్ ఫోన్లపై మరింతగా దృష్టి పెడుతుండటం శాంసంగ్ అమ్మకాల వృద్ధికి దోహదపడగలవు. → అఫోర్డబుల్ ప్రీమియం కేటగిరీలో (రూ. 30,000 – 45,000 ధర శ్రేణి) అధునాతన కెమెరాలు మొదలైన ఫీచర్లను అందించడం ద్వారా వివో, ఒపో, వన్‌ప్లస్ లాంటి → చైనా బ్రాండ్లు, కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఫోన్ల పనితీరును దెబ్బతీసిన డిస్ప్లే, మదర్బోర్డ్ సమస్యలకు సంబంధించి రిటైలర్ల ఆందోళనల ను పరిష్కరించడం ద్వారా మళ్లీ మార్కెట్‌పై ప ట్టు సాధించేందుకు వన్‌ప్లస్ కసరత్తు చేస్తోంది. వేగవంతమైన రికవరీ, వృద్ధి సాధన కోసం స్థా నిక మార్కెట్లో విస్తరించేందుకు దాదాపు రూ. 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. → ప్రీమియం సెగ్మెంట్ (రూ. 30,000 ధర పైన ప్రారంభమయ్యే ఫోన్లు) 20 శాతానికి మించి మార్కెట్ వాటా దక్కించుకోవచ్చు. → కొనుగోలు చేయడానికి ముందు ప్రీమియం ఫోన్లను స్వయంగా చేతిలోకి తీసుకుని, పరిశీలించేందుకు వినియోగదారులు ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ఎంచుకుంటున్నారు. అలాగే కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత అంశాల మీద ఆసక్తితో వివిధ ఫీచర్ల గురించి అడిగి తెలుసుకుని, కొనుగోలు చేస్తున్నారు. ప్రీమియం సెగ్మెంట్లో అమ్మకాల వృద్ధికి ఇలాంటి ధోరణులు కూడా తోడ్పడుతున్నాయి. -
మూడేళ్ల కనిష్టానికి దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 10 శాతం క్షీణించింది. అమ్మకాలు మూడేళ్ల కనిష్టం 4.3 కోట్ల స్థాయికి పడిపోయాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) సోమవారం ఈ అంశాలు వెల్లడించింది. 2019 తర్వాత ఒక మూడో త్రైమాసికంలో ఇంత తక్కువ స్థాయి నమోదు కావడం ఇదే ప్రథమం అని తెలిపింది. బలహీనపడుతున్న డిమాండ్, పెరుగుతున్న ధరలు వెరసి పండుగ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది. నిల్వలు పేరుకుపోవడం, పండుగ సీజన్ తర్వాత డిమాండ్ తగ్గుముఖం పట్టడం తదితర అంశాలతో డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు నెమ్మదించవచ్చని ఐడీసీ డివైజ్ రీసెర్చ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవ్కేందర్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో 2022 వార్షిక అమ్మకాలు 8–9 శాతం క్షీణించి 15 కోట్ల యూనిట్లకు పరిమితం కావచ్చని పేర్కొన్నారు. పెరుగుతున్న డివైజ్‌ల ధరలు, ఇతరత్రా ద్రవ్యోల్బణం, ఫీచర్ ఫోన్ నుండి స్మార్ట్‌ఫోన్‌కు మారడం నెమ్మదించడం తదితర అంశాలు 2023లో డిమాండ్‌కి ప్రధాన సవాళ్లుగా ఉండవచ్చని తెలిపారు. అయితే, 4జీ నుండి 5జీకి మారుతుండటం మిడ్–ప్రీమియం, అంతకు మించిన సెగ్మెంట్లలో వృద్ధికి కొంత దోహదపడవచ్చని సింగ్ వివరించారు. నివేదికలో మరిన్ని వివరాలు.. ► సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాల్లో ఆన్లైన్ పోర్టల్స్ వాటా అత్యధికంగా 58 శాతంగా నమోదైంది. ఈ–టెయిలర్లు పలు విడతలుగా నిర్వహించిన ’సేల్స్’ (ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్, అమెజాన్‌లో గ్రేట్ ఇండియా ఫెస్టివల్ మొదలైనవి) ఇందుకు దోహదపడ్డాయి. ఆన్లైన్ ఎక్స్‌క్లూజివ్ డీల్స్, ఆఫర్లు, డిస్కౌంట్లు ఇందుకు సహాయపడ్డాయి. ఆన్‌లైన్‌తో పోటీపడుతూ డిమాండ్‌ను అందుకోవడంలో ఆఫ్‌లైన్ స్టోర్స్ విఫలమయ్యాయి. దీంతో ఆఫ్‌లైన్ విక్రయాలు 20 శాతం క్షీణించాయి. ► మీడియాటెక్ ఆధారిత స్మార్ట్ఫోన్ల మార్కెట్ వాటా 47 శాతానికి పెరిగింది. క్వాల్కామ్ వాటా 25 శాతానికి తగ్గింది. ► 21.2 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు షావోమీ సారథ్యం వహించింది. 18.5% మార్కె ట్ వాటాతో శాంసంగ్ రెండో స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. వివో (14.6%), రియల్‌మి (14.2%), ఒప్పో (12.5%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రీమియం కేటగిరీలో 63 శాతం వాటాతో యాపిల్ అగ్రస్థానంలో నిల్చింది. షావోమీ టాప్ ప్లేస్లోనే ఉన్నప్పటికీ అమ్మకాలు 18 శాతం క్షీణించాయి. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో 5జీ ఫోన్ల వాటా 36 శాతానికి చేరింది. 1.6 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. -
చైనా బ్రాండ్లతో స్మార్ట్ ఫోన్ విక్రయాల జోష్..
♦ క్యూ2లో 17 శాతం వృద్ధి ♦ 2.75 కోట్లకు అమ్మకాలు న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ2)లో 2.75 కోట్ల యూనిట్లకు చేరాయి. చైనా కంపెనీలైన లెనొవొ, షావోమి, వివో వంటి కంపెనీలే ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచాయి. స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో గత త్రైమాసికంతో పోలిస్తే 17% వృద్ధి, గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 3.7% వృద్ధి నమోదయ్యింది. రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మొబైల్ కంపెనీలు 2.35 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే క్యూ2లో పలు ఇతర దేశాలు సహా దేశీ మొబైల్ కంపెనీల స్మార్ట్‌ఫోన్ విక్రయాలు తగ్గితే.. చైనా కంపెనీల అమ్మకాలు మాత్రం 75 శాతం ఎగశాయి. జనవరి-మార్చి క్వార్టర్‌తో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లెనొవొ సహా షావోమి, వివో, జియోనీ, ఒప్పొ కంపెనీల విక్రయాలు 28 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు రిటైల్ వ్యాపారంపై ఎక్కువ దృష్టి నిలపడంతో ఆన్లైన్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 35 శాతం నుంచి 28 శాతానికి పడ్డాయి. గతేడాదితో క్యూ2తో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో ఫీచర్ ఫోన్ల విక్రయాలు 2.6 శాతం వృద్ధితో 3.37 కోట్ల యూనిట్లకు చేరాయి. కాగా శాంసంగ్ 25 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. ఇక దీని తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్ (12 శాతం), లెనొవొ గ్రూప్ (8%), ఇంటెక్స్ (7%), రిలయన్స్ జియో (6.8 %) ఉన్నాయి.