చైనా బ్రాండ్లతో స్మార్ట్ ఫోన్ విక్రయాల జోష్..
♦ క్యూ2లో 17 శాతం వృద్ధి
♦ 2.75 కోట్లకు అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ2)లో 2.75 కోట్ల యూనిట్లకు చేరాయి. చైనా కంపెనీలైన లెనొవొ, షావోమి, వివో వంటి కంపెనీలే ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచాయి. స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో గత త్రైమాసికంతో పోలిస్తే 17% వృద్ధి, గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 3.7% వృద్ధి నమోదయ్యింది. రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మొబైల్ కంపెనీలు 2.35 కోట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించాయి.
వార్షిక ప్రాతిపదికన చూస్తే క్యూ2లో పలు ఇతర దేశాలు సహా దేశీ మొబైల్ కంపెనీల స్మార్ట్‌ఫోన్ విక్రయాలు తగ్గితే.. చైనా కంపెనీల అమ్మకాలు మాత్రం 75 శాతం ఎగశాయి. జనవరి-మార్చి క్వార్టర్‌తో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లెనొవొ సహా షావోమి, వివో, జియోనీ, ఒప్పొ కంపెనీల విక్రయాలు 28 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు రిటైల్ వ్యాపారంపై ఎక్కువ దృష్టి నిలపడంతో ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 35 శాతం నుంచి 28 శాతానికి పడ్డాయి.
గతేడాదితో క్యూ2తో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో ఫీచర్ ఫోన్ల విక్రయాలు 2.6 శాతం వృద్ధితో 3.37 కోట్ల యూనిట్లకు చేరాయి. కాగా శాంసంగ్ 25 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. ఇక దీని తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్ (12 శాతం), లెనొవొ గ్రూప్ (8%), ఇంటెక్స్ (7%), రిలయన్స్ జియో (6.8 %) ఉన్నాయి.