టీసీఎస్ లాభం 6,586 కోట్లు | TCS Q2 net up 8.2%; topline growth disappoints | Sakshi
Sakshi News home page

టీసీఎస్ లాభం 6,586 కోట్లు

Published Fri, Oct 14 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

టీసీఎస్ లాభం 6,586 కోట్లు

టీసీఎస్ లాభం 6,586 కోట్లు

క్యూ2లో 8.4 శాతం వృద్ధి
ఆదాయం రూ. 29,284 కోట్లు; 8 శాతం అప్
రూ. 6.5 మధ్యంతర డివిడెండ్

 ముంబై: దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్ మార్కెట్ విశ్లేషకుల అంచనాలతో పోలిస్తే మిశ్రమంగా ఫలితాల సీజన్‌ను ఆరంభించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో కంపెనీ రూ.6,586 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.6,073 కోట్లతో పోలిస్తే 8.4 శాతం వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో క్లయింట్లు ఐటీ వ్యయాల విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నారని టీసీఎస్ పేర్కొంది. అయితే, ఈ ఏడాది ద్వితీయార్ధం చాలా మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక కన్సాలిడేట్ ఆదాయం కూడా దాదాపు 8 శాతం పెరుగుదలతో రూ.29,284 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ. 27,165 కోట్లుగా ఉంది.

సీక్వెన్షియల్‌గా ఇలా...
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లాభం రూ.6,317 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్‌గా) క్యూ2లో 4.3 శాతం వృద్ధి సాధించింది. అయితే, ఆదాయం మాత్రం క్యూ1లో రూ.29,305 కోట్లతో పోలిస్తే స్వల్పంగా (0.1%) తగ్గింది. ఐటీ కంపెనీలకు సీజనల్‌గా ఆదాయాల పరంగా పటిష్టమైన క్వార్టర్‌గా క్యూ2ను పరిగణిస్తారు. డాలర్ల రూపంలో ఆదాయం 0.3 శాతం మాత్రమే వృద్ధి చెంది 4.362 బిలియన్ డాలర్ల నుంచి 4.374 బిలియన్ డాలర్లకు చేరింది. మార్జిన్లు స్థిరంగానే కొనసాగినప్పటికీ.. ఇతర అంశాల్లో మార్కెట్ వర్గాల అంచనాలను టీసీఎస్ అందుకోలేకపోయింది. లాభం సీక్వెన్షియల్‌గా 0.9 శాతం తగ్గి రూ.6,290 కోట్లుగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇక ఆదాయం 1.5 శాతం వృద్ధితో రూ. 29,738 కోట్లుగా అంచనా వేశారు. డాలర్లలో ఆదాయం 1.8 శాతం వృద్ధి చెంది 4.44 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని లెక్కగట్టారు.

ఇతర ముఖ్యాంశాలివీ...
క్యూ1లో నిర్వహణ మార్జిన్ 0.94 శాతం పెరిగి 26 శాతానికి చేరింది.

యూరప్ వ్యాపారంలో సీక్వెన్షియల్‌గా పటిష్టమైన 3.7 శాతం వృద్ధి నమోదైంది. ఆసియా-పసిఫిక్ 3.5  శాతం, ఉత్తర అమెరికా 1.4 శాతం చొప్పున వృద్ధి చెందాయి. బ్రిటన్‌కు సంబంధించి వృద్ధి నామమాత్రంగానే ఉంది. ఇక భారత్ వ్యాపారం 7.6 శాతం తగ్గడం గమనార్హం.

లైఫ్ సెన్సైస్-హెల్త్‌కేర్ విభాగంలో ఆదాయం సీక్వెన్షియల్ ప్రాతిపదికన 4.7 శాతం వృద్ధి చెందింది. ఇంధనం, యుటిలిటీ విభాగాల్లో ఆదాయం 3.6 శాతం పెరిగింది.

జూలై-సెప్టెంబర్ కాలంలో కంపెనీ స్థూలంగా 22,665 మంది సిబ్బందిని జతచేసుకుంది. అయితే, 13,225 మంది ఉద్యోగులు వలసపోవడం(అట్రిషన్)తో నికరంగా 9,440 మంది మాత్రమే జతయ్యారు. ఇక సెప్టెంబర్ చివరినాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.71 లక్షలకు చేరింది. అట్రిషన్ రేటు 11.9 శాతానికి పరిమితమైంది.

రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేరుపై కంపెనీ రూ.6.5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

గురువారం టీసీఎస్ షేరు ధర బీఎస్‌ఈలో 2.17 శాతం నష్టపోయి రూ.2,329 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ ఒక్కరోజులో రూ.10,167 కోట్లు దిగజారి రూ.4,58,814 కోట్లకు పడిపోయింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి.

రెండో త్రైమాసికం పనితీరు చాలా అసాధారణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతుండటంతో క్లయింట్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో క్యూ2లో ఐటీ వ్యయాలు తగ్గేందుకు దారితీసింది. మరోపక్క భారత్, లాటిన్ అమెరికా మార్కెట్లలో ఒడిదుడుకులు కూడా ఆదాయ వృద్ధి మందకొడిగా ఉండేందుకు కారణమైంది. అయితే, అనేక సమస్యలు నెలకొన్నప్పటికీ.. లాభాల విషయంలో క్యూ2లో మంచి పనితీరును నమోదుచేయగలిగాం.

కార్యకలాపాల నిర్వహణలో మేం అనుసరిస్తున్న క్రమశిక్షణ కారణంగా మార్జిన్లను కూడా పటిష్టంగానే కొనసాగించగలిగాం. వచ్చే రెండు క్వార్టర్లలో పనితీరు గడిచిన కొన్నేళ్లలో ఇవే క్వార్టర్లతో పోలిస్తే అత్యంత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నాం. క్యూ2లో జాప్యమైన పలు ప్రాజెక్టులు ద్వితీయార్ధంలో కార్యరూపం దాల్చనున్నాయి. కొత్తతరం డిజిటల్ టెక్నాలజీల్లో సుమారు 1.8 లక్షల మంది కంపెనీ ఉద్యోగులు శిక్షణను పూర్తిచేసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, బ్రెగ్జిట్ ప్రభావం మా వ్యాపారంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని భావించడం లేదు. అయితే, కొంతమంది క్లయింట్ల ఐటీ పెట్టుబడులు జాప్యం కావడానికి ఆస్కారం ఉంది. 
- ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ సీఈఓ, ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement