ఐటీ రంగానికి ‘క్యూ2’ కష్టాలు? | TCS Q2 Result Preview: 5 things to watch out for | Sakshi
Sakshi News home page

ఐటీ రంగానికి ‘క్యూ2’ కష్టాలు?

Published Thu, Oct 13 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

ఐటీ రంగానికి ‘క్యూ2’ కష్టాలు?

ఐటీ రంగానికి ‘క్యూ2’ కష్టాలు?

నేడు టీసీఎస్ ఫలితాలతో సీజన్ షురూ..
వృద్ధి తీవ్రంగా మందగించొచ్చంటున్న విశ్లేషకులు
బ్రెగ్జిట్, బీఎస్‌ఎఫ్‌ఐ క్లయింట్ల వ్యయాల తగ్గుదల,
కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గుల ప్రభావం

 ముంబై: దేశీ ఐటీ కంపెనీలకు ప్రస్తుతం కష్టకాలం నడుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో దిగ్గజ ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు అత్యంత నిరాశాజనకంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నేడు(గురువారం) అగ్రగామి టీసీఎస్‌తో క్యూ2 ఫలితాల సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఇన్ఫోసిస్ ఫలితాలు వెలువడనున్నాయి. సాధారణంగా రెండో త్రైమాసికంలో ఐటీ కంపెనీలు సీజనల్‌గా చాలా పటిష్టమైన వృద్ధి నమోదుచేస్తుంటాయని..

అయితే, ఇప్పుడు దీనికి భిన్నంగా ఫలితాలు వెలువడవచ్చనేది విశ్లేషకుల మాట. కాగా, టీసీఎస్ ఇప్పటికే దీనికి సబంధించిన సంకేతాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్)తో పాటు బ్యాంకింగ్-ఫైనాన్షియల్ సేవల విభాగం(బీఎస్‌ఎఫ్‌ఐ) క్లయింట్ల ఐటీ వ్యయాలు తగ్గుముఖం పట్టడం కూడా దేశీ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.

మొత్తం ఐదు టాప్ ఐటీ కంపెనీలకు సంబంధించి క్యూ2 ఆదాయం(సీక్వెన్షియల్‌గా) కేవలం 1.5 శాతం మాత్రమే వృద్ధి చెందొచ్చనేది ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా. గడిచిన దశాబ్ద కాలంలో ఇదే అత్యంత బలహీన క్యూ2గా నిలవనుందని కూడా  అభిప్రాయపడింది.

టీసీఎస్ పరిస్థితి ఏంటి?
క్యూ2లో టీసీఎస్ స్థిర కరెన్సీ ప్రాతిపదికన వృద్ధి సీక్వెన్షియల్‌గా(క్యూ1తో పోలిస్తే) పెద్దగా పెరగకపోవచ్చని భావిస్తున్నారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో జూలై-సెప్టెంబర్ మధ్య బ్రిటన్ పౌండ్ డాలరుతో పోలిస్తే 8.4 శాతంమేర దిగజారింది. దీనికి తోడు ఇతర కరెన్సీల తీవ్ర హెచ్చుతగ్గుల నేపథ్యంలో క్యూ2లో డాలరు ఆదాయాలపై 40-80 బేసిస్ పాయింట్లు(100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) ప్రతికూల ప్రభావం ఉండొచ్చని బ్రోకరేజి కంపెనీల విశ్లేషకులు పేర్కొన్నారు. డాలరు ఆదాయంలో సీక్వెన్షియల్‌గా 1.5 శాతం వృద్ధి ఉండొచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ పేర్కొంది. సెంట్రమ్ బ్రోకింగ్ మాత్రం ఈ వృద్ధి 2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. టీసీఎస్ ఆదాయంలో బ్రిటన్ పౌండ్‌ల రూపంలో 13 శాతం నమోదవుతోంది.

సీక్వెన్షియల్ డాలరు ఆదాయ వృద్ధికి సంబంధించి టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రోలకు కూడా ఈ క్యూ2 అత్యంత బలహీన క్వార్టర్‌గా నిలిచే అవకాశం ఉందనేది రిలయన్స్ సెక్యూరిటీస్ అంచనా. దేశీ ఐటీ కంపెనీలకు అత్యధిక ఆదాయం లభించే అమెరికాలో బీఎస్‌ఎఫ్‌ఐ విభాగం క్లయింట్ల వ్యయాలు మందగించడం వృద్ధిపై ప్రభావం చూపుతుందని బ్రోకరేజి కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇదే విషయంపై టీసీఎస్ కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది కూడా. దీనికి తోడు పోటీ విపరీతంగా పెరగడంతో ప్రైసింగ్ ఒత్తిళ్లు కూడా రానున్న కొద్ది క్వార్టర్లలో దేశీ ఐటీ కంపెనీల రాబడులకు ప్రతికూలంగా నిలవనుందని అంటున్నాయి. కాగా, టీసీఎస్ ఆదాయంలో అత్యధికం (40.4%) బీఎస్‌ఎఫ్‌ఐ విభాగానిదే కావడం గమనార్హం.

లాభాలు తగ్గొచ్చు...
ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్, క్యూ1)లో టీసీఎస్ రూ.6,497 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ4లో రూ.6,413 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా 1.31 శాతం వృద్ధి నమోదైంది. కాగా, క్యూ2లో కంపెనీ రూ.6,178 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయొచ్చని మరో బ్రోకరేజి సంస్థ మోతీలాల్ ఓశ్వాల్ అభిప్రాయపడింది. ప్రధానంగా ఫారెక్స్ నష్టాల ప్రభావంతో ఇతర ఆదాయాలు దిగజారడం లాభాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.

అయితే, ఎడెల్ వైజ్ మాత్రం నికర లాభం సీక్వెన్షియల్‌గా 1.1 శాతం, వార్షిక ప్రాతిపదికన(గతేడాది క్యూ2తో పోలిస్తే) 5.4 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. కాగా, ఇన్ఫోసిస్ నికర లాభం సీక్వెన్షియల్‌గా క్యూ2లో 2.6 శాతం తగ్గుదలతో రూ. 3,347 కోట్లుగా నమోదు కావచ్చని మోతీలాల్ ఓశ్వాల్ పేర్కొంది. మొత్తం ఆదాయం 1.6 శాతం వృద్ధితో(వార్షిక ప్రాతిపదికన 9 శాతం వృద్ధి) రూ.17,048 కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement