ముంబై, సాక్షి: ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్ తాజాగా నవంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆశావహ ఫలితాలు ప్రకటించింది. దీంతో దేశీయంగా లిస్టెడ్ దిగ్గజ కంపెనీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ 2 శాతం ఎగసి 23,408 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని చేరుకుంది. అంతేకాకుండా సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ సరికొత్త గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. (కన్సాలిడేషన్ బాటలో- 47,000కు సెన్సెక్స్)
యాక్సెంచర్ జోష్
ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తొలి త్రైమాసికంలో డాలర్ల రూపేణా 4 శాతం వృద్ధితో 11.8 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. ఇది అంచనాలకంటే అధికంకాగా.. నిర్వహణ లాభ మార్జిన్లు 0.5 శాతం బలపడి 16.1 శాతానికి చేరాయి. ప్రయాణ వ్యయాలు తగ్గడం, పెరిగిన ఉత్పాదకత వంటి అంశాలు మార్జిన్లకు బలాన్నిచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో 25 శాతం వృద్ధితో 12.9 బిలియన్ డాలర్ల విలువైన తాజా డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. పూర్తి ఏడాదికి ఆదాయం 4-6 శాతం స్థాయిలో పుంజుకోగలదని తాజాగా అంచనా వేసింది. నిర్వహణ లాభం 7 శాతం పెరిగి 1.89 బిలియన్ డాలర్లను తాకింది. (గత నెల అమ్మకాలలో టాప్-3 కార్లు)
షేర్ల జోరు
యాక్సెంచర్ 4-6 శాతం వృద్ధితో ఆదాయ అంచనాలను ప్రకటించిన నేపథ్యంలో ఐటీ కౌంటర్లు జోరందుకున్నాయి. ఎన్ఎస్‌ఈలో ప్రస్తుతం ఇన్ఫోసిస్ దాదాపు 3 శాతం ఎగసి రూ. 1,193 సమీపానికి చేరింది. ఇక టీసీఎస్ 2 శాతం బలపడి రూ. 2,894ను తాకింది. ఇవి ఇది సరికొత్త గరిష్టాలుకాగా.. హెచ్‌సీఎల్ టెక్ 2.5 శాతం లాభంతో రూ. 901 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో కోఫోర్జ్ 2.3 శాతం పుంజుకుని రూ. 2,569 వద్ద, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ 1.6 శాతం బలపడి రూ. 3,359 వద్ద, ఎంఫసిస్ 1.6 శాతం పెరిగి రూ. 1,361 వద్ద కదులుతున్నాయి. విప్రొ 1.3 శాతం లాభంతో రూ. 362 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment